Kodi Katti Case Updates: కోడికత్తి కేసులో ఎటువంటి కుట్రకోణం లేదని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని.. మళ్లీ లోతైన విచారణ అవసరం లేదని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది వాదించారు. రెండో రోజు కూడా ఇన్-కెమెరా పద్ధతిలో విచారణ సాగింది. ఈ అంశంపై లోతైన దర్యాప్తునకు సీఎం జగన్ చేసిన అభ్యర్థనపై తాము ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని ఎన్‌ఐఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశాల్ గౌతం చెప్పారు. ఘటన జరిగి ఐదు సంవత్సరాలు అయ్యి, కేసు విచారణ ప్రారంభమైన దశలో హఠాత్తుగా తిరిగి దర్యాప్తు డిమాండ్ తీసుకురావడం సహేతుకం కాదని ఎన్‌ఐఏ న్యాయవాది అన్నారు.
ఆ పిటిషన్ కూడా కొట్టివేయండి: ఎన్‌ఐఏ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిందని, రాజకీయ జోక్యం, పక్షపాతానికి తావు లేకుండా నిర్వహించిందన్నారు. నిందితుడు శ్రీనివాసరావుపై అభియోగాల అన్నింటిపై నిజాలను వెలికితీశామన్నారు. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించామని, వీటి ప్రకారం అతనొక్కడినే నిందితుడిగా పేర్కొంటూ అభియోగపత్రం దాఖలు చేశామని చెప్పారు. కుట్ర కోణం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదన్నారు. నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం సైతం లోతైన దర్యాప్తు కోసం చేసిన వేసిన పిటిషన్‌ను అనుమతించొద్దని కోరారు. కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే నిందితుడు ఐదు సంవత్సరాలుగా రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్ ఖైదీగా మగ్గుతున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. మళ్లీ దర్యాప్తునకు ఆదేశిస్తే న్యాయం ఆలస్యం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్, ఎన్‌ఐఏ, నిందితుడి తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తి కావడంతో తుది ఉత్తర్వుల నిమిత్తం న్యాయమూర్తి ఏ. సత్యానంద్.. కేసును ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు.