ఏడాది పాలనలో ప్రజలకు కనీసం ఇసుక కూడా సరిగ్గా ఇవ్వలేకపోవటం జగన్ అసమర్థతకు నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని ఇసుక నిల్వ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన... ఇసుక విషయంలో జగన్ మాట తప్పి రివర్స్ గేర్లో వెళ్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి అసమర్థులకు పాలించే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న అప్రజాస్వామిక నిర్ణయాలను కోర్టులు తప్పు పడుతున్నాయని... మీ వల్ల అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని మండిపడ్డారు.
ఇసుక దోపిడీ విషయంలో తెదేపా కంటే వైకాపా మరింతగా బరితెగించిందన్నారు. లారీ ఇసుకకు తాను 45 వేలు చెల్లించానని తెలిపారు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచితే మళ్లీ గెలవొచ్చనుకోవటం భ్రమని... తెదేపా కంటే దారుణ పరిస్థితులు వైకాపా చూడబోతోందన్నారు. ఇసుక అందుబాటులో ఉంచకపోతే ప్రభుత్వం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు.