PAWAN IN UNSTOPPABLE 2 : రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవని, ఏ రంగంలోనైనా నమ్మకం సంపాదించాలంటే కొన్ని దశాబ్దాల సమయం పడుతుందని ప్రముఖ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’ కార్యక్రమానికి ఆయన హాజరైన సంగతి తెలిసిందే. గతవారం తొలి ఎపిసోడ్ రాగా ఈవారం రెండో ఎపిసోడ్ విడుదలైంది. అందులోని కొన్ని సంగతులివీ..
అలా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ..
‘‘నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగా ఉండేది. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, రక్షిత మంచి నీటిని అందించాలని ప్రయత్నం చేశా. ఆ మేరకు కొద్దిమందిని అక్కడికి పంపిస్తే స్థానిక రాజకీయ గ్రూప్స్ అడ్డుకున్నాయి. మంచి చేయడానికి కూడా అడ్డంకులు ఉంటాయా? అనిపించింది. ఎన్జీవో ప్రారంభించాలనుకున్నా. తర్వాత నా ఆలోచనా పరిధికి ఎన్జీవో సరిపోదనిపించింది. ఇంకా పెద్దగా ఏదో చేయాలనుకున్నా. అలా రాజకీయ పార్టీ పెట్టాం. నేను ఓ ఆలోచనతో ఉన్నా. అదే సమయంలో.. ఓసారి కలవాలంటూ నరేంద్ర మోదీ గారి నుంచి నాకు కబురు వచ్చింది. మార్చిలో పార్టీ పెట్టాం. ఎన్నికలు ఏప్రిల్ మధ్యలో వచ్చాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్డమ్ పాలిటిక్స్‌లో కూడా వచ్చేస్తుందని చాలామంది అనుకుంటారు. ఎన్. టి. రామారావు, ఎంజీఆర్ గారి విషయంలో అది జరిగింది. అందరికీ అలానే అవుతుందని లేదు. ఆ స్పష్టత నాకుంది. రాం మనోహర్ లోహియా, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రభావం నాపై చాలా ఎక్కువగా ఉంది. ఓ స్థాయిలో ఉండి కిందకు పడిపోయినా మళ్లీ అక్కడ నుంచి మొదలు పెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నాకు పాలిటిక్స్ నేర్చుకోవాలనుంది’’
అన్నయ్య నుంచి నేర్చుకున్నవవే..
‘‘ఒళ్లు దాచుకోకుండా కష్టపడేతత్వాన్ని అన్నయ్య చిరంజీవి నుంచి అలవరుచుకున్నా. పాలిటిక్స్‌లో విమర్శను కచ్చితంగా స్వీకరించాలి. ఏ విమర్శనైనా భరించాలనే దాన్నీ ఆయన నుంచే నేర్చుకున్నా. సద్విమర్శ వల్ల మనలోని లోపాలేంటో తెలుసుకుని, సరిచేసుకునే అవకాశం ఉంటుంది. అన్నయ్య నుంచి తీసుకోనిది ఏదైనా ఉందంటే అది మొహమాటం. అభిమానం వేరు.. అది ఓటుగా మారడం వేరు. సినిమా రంగంలో ఎవరైనా ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించుకుని, ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే దాని వెనుక దశాబ్దాల కృషి ఉంటుంది. సినీ పరిశ్రమలో పేరున్న వ్యక్తి రాజకీయ రంగంలోకి ప్రవేశించి, అంతటి నమ్మకం పొందాలంటే సమయం పడుతుంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. తక్కువలో తక్కువ దశాబ్దన్నర తర్వాత మీరు అడిగితే నా సమాధానం వేరుగా ఉంటుంది. ప్రస్తుతానికి నేను నమ్మకాన్ని సంపాదించుకునే పరిస్థితిలోనే ఉన్నా’’
‘‘అధికారమనేది సాధ్యమైనంత ఎక్కువమందికి అండగా ఉండాలని, మనల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు ఉండకూడదని నేను కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ హక్కుని సద్వినియోగం చేసుకోగలిగే సామర్థత కలిగి ఉండాలి. దాన్ని ఎవరైనా కాలరాసినా ఎదుర్కొనే శక్తి ఉండాలి. దానిలో భాగంగా నేను ముందుకెళ్తున్నా. ఆ క్రమంలో అధికారం వస్తుందో రాదో నాకు తెలియదు. నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్లడమే’’ అని పవన్ అన్నారు.
విశాఖపట్నంలో జరిగిన ఘటన గురించి స్పందిస్తూ.. ‘‘నేను ఓ అడుగు వేసినా, మాట్లాలనుకున్నా ప్రభుత్వంలో ఉండేవారందరికీ ఇబ్బందిగా ఉంటుంది. నేను మామూలుగా చూసినా దానికీ ఓ అర్థం తీస్తారు. నేను వైజాగ్ వెళ్లకూడదని ఎన్నో కుట్రలు పన్నారు. కానీ, నేను వాళ్లతో పోటీ పెట్టుకోలేదు. వారి ఆలోచన ఏంటో తెలియదుగాని లైట్ ఆపేయడంలాంటివి చేశారు. అవన్నీ సహజమేగానీ అధికార యంత్రాంగం కూడా హద్దులు దాటి అమాయికులు, ఓ మహిళపై హత్యాయత్నం కేసులు పెట్టారు. ఆధిపత్య ధోరణి అది. ఎవరూ నోరెత్తకూడదంటే ఎలా? నేను నోరెత్తుతా.. అది ప్రజలకు చేరుతుందన్న ఇబ్బంది వారికి ఉందనుకుంటా. అయితే, నేను దాన్ని రాజకీయంలో భాగంగానే చూస్తా’’
జనసేన సభకు స్థలమిచ్చారనే.. ఇళ్లు కూల్చారు:‘జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారన్న కారణంగానే గుంటూరు జిల్లాలో ఇప్పటం గ్రామరైతుల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయించింది. అప్పటికే వారికి ఇచ్చిన నోటీసులను ఇదే అవకాశంగా వాడుకుంది. నేను వారిని పలకరించడానికి ఇప్పటం వెళ్దామనుకున్నా. పోలీసులు కదలనివ్వలేదు. అనుమతి లేదన్నారు. అంతకుముందు విశాఖలోనూ ఇబ్బంది పెట్టారు. కారులో ప్రజలకు కనబడకూడదు, చేతులు ఉపకూడదన్నారు. లైట్లు తీసేశారు. హోటల్ గదిలో నిర్బంధించారు. బయటకు రాకూడదన్నారు' అని పవన్ వివరించారు.
‘‘ఇప్పటం గ్రామం వెళ్లేటపుడూ అలానే వ్యవహరించారు. ‘మీరు అక్కడికి వెళ్లకూడదు. వెళ్తే గొడవ చేస్తారు’ అంటూ పోలీసు అధికారులు నన్ను ఆపారు. ‘బాధితులను పరామర్శించడం నా ప్రాథమిక హక్కు’ అని చెప్పా. రోడ్డుపై నడవకూడదు, కారులోంచి బయటకు రాకూడదు, రూమ్‌లో ఉండకూడదు, రూమ్‌లోంచి బయటకు రాకూడదు.. అని అంటుంటే చాలాకాలం తర్వాత నాకు కొంచెం తిక్క వచ్చింది. అందుకే ఎవరు ఆపుతారో చూద్దాం అంటూ కారుపైకి ఎక్కి కూర్చొన్నా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను నడుస్తా. ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. నేను వెళ్తా అన్న ధోరణిలో అక్కడికి వెళ్లా. అది నిరసనలో ఓ భాగం" అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వివరించారు. ఆహా ఓటీటీ వేదికపై ‘అన్‌స్టాప్‌బుల్ విత్ బాలకృష్ణ’ కార్యక్రమం రెండో భాగంలో పవన్‌కల్యాణ్ రాజకీయ, వ్యక్తిగత అంశాలను వివరించారు.