veligonda project : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై రాష్ట్ర బడ్జెట్లో కేవలం 5% కేటాయించిందని, వెలిగొండ ప్రాజెక్టు కోసం కేవలం 100 కోట్ల రూపాయలు కేటాయించడం అన్యాయమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డి అన్నారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్ర బడ్జెట్లలో 15% నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయించడంతో పాటు అదే మొత్తాన్ని వ్యయం చేశారని గుర్తు చేశారు. ఫలితంగా నీటిపారుదల ప్రాజెక్టులు వేగంగా అమలయ్యాయన్నారు. నేడు అధ్వాన్న స్థితిలో ఉన్నాయని.. 2023 సెప్టెంబర్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. బడ్జెట్ లో 100 కోట్లు మాత్రమే కేటాయించారని దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. 2005లో ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి హయంలో వేగంగా అభివృద్ధి చేశారని.. గత నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి, పనుల్లో వేగం మందగించిందని తెలిపారు. దీనిపై 24న ఒంగోలు లో సదస్సు నిర్వహించనున్నట్లు వివరించారు.
కృష్ణా, గోదావరి, పెన్నా నదీ జలాలతో రాష్ట్రం అంతా నీటిని అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్టు. దాదాపు 4.7లక్షల ఎకరాలకు నీరందించే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో కేవలం వంద కోట్ల నిధుల విడుదల వెచ్చించింది. ఇప్పటికే 90శాతం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుకు.. ఈ లెక్కన ఏటా 100 కోట్లు రూపాయలు ఖర్చు చేసినా ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 30 సంవత్సరాలు పడుతుంది. 3వేల కోట్ల రూపాయలు కేటాయించి త్వరగా పూర్తి చేసి సాగు, తాగు నీరందించాలి. ఈ మేరకు ఒంగోలులో ఈ నెల 29న నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలి. - వీ.లక్ష్మణరెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు