Investments not coming to Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు పెట్టుబడిదారులకు స్వర్గధామం. కానీ ఇప్పుడు వైసీపీ అరాచక పాలనకు భయపడి రాష్ట్రం వైపు తొంగి చూడాలంటేనే హడలిపోతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా తెలుగుదేశం సానుకూల పరిస్థితులను సృష్టించింది. దాంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తరలి వచ్చాయి. జగన్ సర్కార్ పెట్టుబడులతో రావాలని ఆహ్వానిస్తున్నా స్పందించేవారే కరవయ్యారు. దేశ, విదేశాల్లో నిర్వహించిన ఎక్స్‌పోలలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసినా ఫలితం శూన్యమే.
రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే అనువైన వాతావరణం ఉండాలి. నిర్ణయాల్లో వేగం, సానుకూల దృక్పథం, ఆకర్షణీయ విధానాలతో.. పాటు స్నేహపూర్వక పరిస్థితులుండాలి. వైసీపీ అధికారంలోకొచ్చాక ఇవన్నీ మారిపోయాయి. ఈ కారణంగానే రాష్ట్రంవైపు చూడాలంటేనే పెట్టుబడిదారులు హడలిపోతున్నారని పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి.
Telangana has 10 Times More FDI Than AP: విదేశీ పెట్టుబడులు.. ఏపీ కంటే తెలంగాణకు 10 రెట్లు ఎక్కువ
వైసీపీ అధికారంలోకి వచ్చీరాగానే గత ప్రభుత్వం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఎంవోయూలు.. వాటికి కేటాయించిన భూముల సమీక్ష పేరుతో ఇబ్బందులకు గురి చేసింది. పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన భూములను వెనక్కి లాక్కుని.. రాష్ట్రం నుంచి వెళ్లిపోయే వరకూ వారి వెంటపడింది. ఎన్ని ఔట్‌రీచ్‌లు నిర్వహించినా విదేశాలకు వెళ్లి పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నాలు చేసినా.. పెట్టుబడిదారులు రాకపోవడానికి అదే కారణం.
రాష్ట్రానికి గత నాలుగున్నరేళ్లలో పీఎస్పీ ప్రాజెక్టులు తప్పించి.. భారీ పెట్టుబడులతో వచ్చిన పరిశ్రమలను వేళ్లమీద లెక్కించొచ్చు. కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ హయాంలో 97 కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా 39వేల 517 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని.. 47వేల 362 కోట్ల పెట్టుబడులతో మరో 49 ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని చెప్పుకుంటోంది.
NIMZ Project Completely Sidelined by CM Jagan: నిమ్జ్ ప్రాజెక్టుపై జగన్ నిర్లక్ష్యం.. పారిశ్రామిక ఉపాధి, అవకాశాలపై పెద్ద దెబ్బ
గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 12వేల24 కోట్ల పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యాయని.. వైసీపీ హయాంలో 2019 నుంచి 2022 మధ్య ఏటా సగటున 12వేల 104 కోట్ల విలువైన పెట్టుబడులు గ్రౌండింగ్ చేసినట్లు చెప్పింది. జగన్ సర్కారు హయాంలో గ్రౌండింగ్ చేసిన పరిశ్రమల్లో చాలా వరకు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభించి.. ఇప్పుడు ఉత్పత్తిలోకి వచ్చినవే ఉన్నాయి.
పెట్టుబడులను ఆకర్షించేందుకు వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఏవో కొన్ని ప్రయత్నాలు చేసినా.. పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలగలేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 15 ఔట్‌రీచ్‌లు నిర్వహించినా.. వైసీపీ బెదిరింపు విధానాల కారణంగా.. ఎవరూ ముందుకు రాలేదు. విజయవాడలో 2019 ఆగస్టులో నిర్వహించిన డిప్లొమాటిక్ ఔట్‌రీచ్‌కు 34 దేశాల రాయబారులు, హై కమిషనర్‌లు, కాన్సుల్ జనరల్స్ హాజరైనా.. రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం సున్నా.
Prathidwani on investments in Andhrapradesh : బై బై జగన్... బై బై ఏపీ
రక్షణ రంగంలో 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు లక్ష్యంగా 2020 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఆటో ఎక్స్‌పో, డిఫెన్స్ ఎక్స్‌పోలో పాల్గొన్న అధికారుల బృందానికి నిరాశే మిగిలింది. పెట్టుబడుల కోసం సౌదీ, దక్షిణ కొరియా దేశాల్లో అధికారుల బృందం పర్యటించినా.. ఏమీ సాధించలేకపోయింది. తైవాన్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ప్రభుత్వం 2020 నవంబరులో తైవానీస్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. కానీ.. పెట్టుబడులు రాలేదు. కెమికల్స్, పెట్రోకెమికల్స్ రంగాల్లో పెట్టుబడుల కోసం 2021 మార్చిలో దిల్లీలో ‘ఇండియాకెమ్’ నిర్వహించినా ఫలితం శూన్యం.
ఫిబ్రవరిలో దుబాయ్‌లో నిర్వహించిన సదస్సులో 5 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. అందులో ఒక్కటి కూడా అమలు కాలేదు. హైదరాబాద్‌లో ‘వింగ్స్ 2022’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య సంస్థగా వ్యవహరించినా ఏమీ సాధించలేకపోయింది. ఇండియా ఫార్మా 2022, ఇండియా మెడికల్ డివైజ్ 2022 పేరిట దిల్లీలో 2022 ఏప్రిల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో అధికారులు పాల్గొన్నా.. రాష్ట్రానికి ఏమీ తేలేకపోయారు.
FDI: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం వెనుకంజ.. దక్షిణాదిలోనే అట్టడుగు స్థానం
సెమికాన్ ఇండియా 2022 పేరిట ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2022 ఏప్రిల్ 29న బెంగుళూరులో సదస్సు నిర్వహించినా.. మన రాష్ట్రానికి ఏమీ దక్కలేదు. 2022 మే 22న దావోస్‌లో జరిగిన ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సుకు సీఎం జగన్ నేతృత్వంలో మొదటిసారి అధికారుల బృందం వెళ్లి.. వివిధ సంస్థలతో రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంది.
రాష్ట్రానికి చెందిన గ్రీన్‌కో, అరబిందో సంస్థలతో పాటు.. అదానితో కుదుర్చుకున్న ఎంవోయూలే. దావోస్ దాకా వెళ్లి.. రాష్ట్రానికి చెందిన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమేంటి? అని ప్రతిపక్షాలు అప్పట్లో విమర్శించాయి. 2022 మే 17న సీఐఐ నేతృత్వంలో నిర్వహించిన ‘ఎక్స్‌కాన్ 2022’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రతినిధులు హాజరైనా ఏమీ రాలేదు.
జగన్‌ను చూసి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా..!: చంద్రబాబు