గుంటూరులోని బొంగరాలబీడు మహాప్రస్థానంలో కట్టెలు కాలుతూనే ఉన్నాయి. కొన్నిరోజులుగా ఈ శ్మశానానికి మృతదేహాలు వరుసకడుతున్నాయి. ఒకప్పుడు నాలుగైదు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన కాటికాపరులు ఇప్పుడు రోజూ పదుల సంఖ్యలో శవాలను దహనం చేస్తున్నారు. బొంగరాల బీడులో గత నాలుగు రోజుల్లోనే ఏకంగా 141 మృతదేహాల్ని ఇక్కడ దహనం చేశారు.
బొంగరాలబీడు మహాప్రస్థానానికి జీజీహెచ్ తోపాటు కొత్తపేటలోని ప్రైవేటు ఆస్పత్రుల నుంచి మృతదేహాలు తెస్తుంటారు. అందులో 80 శాతం మృతదేహాల్ని జిప్ వేసే తెస్తున్నారు. కొవిడ్ వైరస్ వల్లే ఇన్ని మరణాలు నమోదవుతున్నాయనేది డయాగ్నసిస్ నివేదికలు చెప్తున్నాయి. కానీ శవాన్ని అప్పగించేటప్పుడు గుండెపోటుగా రాసి పంపుతున్నారు. మరికొందరి నివేదికల్లో బైలేటరీ నిమోనియాగా, మరికొందరి నివేదికల్లో నిమోనియా వైరల్‌గా చూపుతున్నారు.