పిట్ట కొంచెం-కూత ఘనం అన్న సామెతకు ఏ మాత్రం తీసిపోవటం లేదు గుంటూరు జిల్లాకు చెందిన జి.హెత్విక్ సుబ్రహ్మణ్యం. రేపల్లెకు చెందిన హరినరసింహారావు, అనూష దంపతుల కుమారుడైన హెత్విక్ చిట్టి బుర్రలో అబ్బురపరిచే అంశాలు ఎన్నో ఉన్నాయి. రెండు సంవత్సరాల నాలుగు నెలల వయసులోనే జ్ఞాపకశక్తి మెండుగా ఉన్న ఈ బుడ్డోడు...ఏదైనా ఒక్కసారి వింటే ఠక్కున చెప్పేస్తాడు. 30 నెలల చిరుప్రాయంలో అనితర సాధ్యమైన రికార్డులు కైవసం చేసుకున్నాడు. మొత్తం 198 దేశాల రాజధానులను అతి తక్కువ సమయంలో చెప్పి రికార్డు సృష్టించాడు. వీటితో పాటు ఇండియాలోని 28 రాష్ట్రాల రాజధానులను సైతం ఇట్టే చెప్పేస్తున్నాడు. తన జ్ఞాపకశక్తితో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను కైవసం చేసుకున్నాడు.
దేశాల, రాష్ట్రాల రాజధానులే కాదు.., పద్యాలు, శ్లోకాలు అవలీలగా వల్లించగలడు. ఏదైనా ఒకసారి వింటే చాలు దానిని సాధన చేస్తూ ఉంటాడని.. ఇంత చిన్న వయస్సులో ఇంతటి జ్ఞాపక శక్తి ఉండటం చాలా ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చిన్నారి తెలివితేటలను మరింత సానపెట్టి దేశానికే ఖ్యాతి తెచ్చేలా కృషి చేస్తామంటున్నారు.