ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై హైకోర్టు స్టే.. రేపు ఆ గ్రామంలో పర్యటించనున్న పవన్ - ఏపీలో ఇళ్ల కూల్చివేత వార్తలు

IPPATAM VILALGE
ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు

By

Published : Nov 4, 2022, 3:49 PM IST

Updated : Nov 4, 2022, 11:02 PM IST

ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు

15:38 November 04

ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై హైకోర్టు స్టే.. రేపు ఆ గ్రామంలో పర్యటించనున్న పవన్

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత.. ఉద్రిక్తతకు దారితీసింది. రహదారి విస్తరణ కోసమంటూ ఉదయాన్నే అధికారులు కూల్చివేతకు దిగారు. ఈ క్రమంలో గ్రామస్థులు అడ్డుకునే యత్నం చేయగా, నిలువరించిన పోలీసులు తొలగింపును కొనసాగించారు. చివరకు బాధితులు కోర్టును ఆశ్రయించగా..కూల్చివేతలను ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. శనివారం ఇప్పటం గ్రామంలో జనసేనాని పవన్‌కల్యాణ్‌ పర్యటించనున్నారు.

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. రహదారి విస్తరణ పనుల పేరిట ఆ గ్రామంలో చేపట్టిన ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత తలెత్తింది. 120 అడుగుల రహదారిని విస్తరిస్తామంటూ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇళ్లు, దుకాణాలు, ఇతర భవనాలను... కూల్చేసేందుకు అధికారులు ఉదయాన్నే గ్రామంలోకి వచ్చారు. వెంటనే అన్నింటికి మార్కింగ్‌లు వేసి తొలగింపును చేపట్టారు. అధికారుల తీరుపై మండిపడ్డ గ్రామస్థులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేత చేపడతారని నిలదీశారు. జేసీబీకి అడ్డుగా నిల్చున్నారు. వారిని పక్కకు నెట్టిన పోలీసులు, అక్రమణలను తొలగింపును కొనసాగించారు. ఈక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

కొన్నేళ్లుగా గ్రామానికి బస్సు సౌకర్యమే లేదన్న స్థానికులు... హఠాత్తుగా ఇప్పుడే ఇప్పటం గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కక్షపూరితంగా తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటం ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన జనసేనాని పవన్‌కల్యాణ్‌, కూల్చివేతలతో పరిపాలన ప్రారంభించిన వైకాపా ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని హెచ్చరించారు. పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకే గ్రామస్థులపై ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. వైకాపాకు ఓట్లేసిన వారికే పాలకులం అన్నట్లుగా ప్రభుత్వ తీరుందని ఎద్దేవా చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని వైకాపా ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం విడ్డూరంగా ఉందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. స్థానిక జనసేన నేతలు సైతం వైకాపా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.


గ్రామస్థులు, జనసేన నేతల ఆరోపణలను అధికారులు తోసిపుచ్చారు. గతంలోనే రెండుసార్లు నోటీసులిచ్చి మార్కింగ్‌ చేసి తొలగింపు గురించి వివరించామని చెబుతున్నారు.ఐనా ఎవరూ ముందుకు రావకపోవడంతోనే కూల్చివేత చేపట్టామని చెప్పారు. ఇళ్ల కూల్చివేతపై గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించగా....తొలగింపును నిలుపుదల చేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 4, 2022, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details