ఆడిటర్ శ్రావణ్ విషయంలో మేజిస్ట్రేట్ చేసింది తీవ్రమైన తప్పు High Court On Auditor Sravan: మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో చార్టర్డ్ అకౌంటెంట్ కుదరవల్లి శ్రావణ్‌కు.. విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్-ఏసీఎంఎం రిమాండ్ విధించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. డిపాజిటర్ల చట్టంతో ముడిపడిన ఈ వ్యవహారంలో.. రిమాండ్ విధించే విచారణాధికార పరిధి.. మూడో ఏసీఎంఎంకు లేదని తేల్చిచెప్పింది. విచారణ పరిధిలేకుండా, యాంత్రికంగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించినప్పుడు బాధితులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చంటూ.. సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసింది.
శ్రావణ్‌ను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ముందు హాజరు పరచాల్సి ఉండగా మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచారని ఆక్షేపించింది. సీఐడీ అభ్యర్ధనను మన్నించి శ్రావణ్‌కు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ తీవ్రమైన తప్పు చేశారని మండిపడింది. ఈ కేసులో అరెస్ట్ చేసి.. 24 గంటలు మించిందా లేదా అనే విషయంపై సమయాన్ని నమోదు చేయడంలోనూ.. మేజిస్ట్రేట్ విఫలమయ్యారంది.
డిపాజిటర్ల చట్టంలోని నిబంధనలను పరిగణనలోకి తీసుకోవడంలోనూ... మేజిస్ట్రేట్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తప్పుపట్టింది. పిటిషనర్‌కు ఉన్న రాజ్యాంగ రక్షణ హక్కులను హరించారని.. అభిప్రాయపడుతూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ DVSS సోమయాజులు, జస్టిస్ వి.శ్రీనివాస్‌తో కూడిన ధర్మాసనం గురువారం కీలక ఉత్తర్వులిచ్చింది. ప్రధాన వ్యాజ్యాన్ని పెండింగ్‌లోనే ఉంచింది.
మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కేసులో చార్టర్డ్ అకౌంటెంట్, తన భర్త శ్రావణ్ అరెస్ట్, జ్యుడిషియల్ రిమాండు పంపే అధికారం విజయవాడ మూడో ACMM కోర్టుకు లేదంటూ ఆయన సతీమణి డాక్టర్ కె.నర్మద.. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై తీర్పును రిజర్వు చేసింది. శ్రావణ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కోర్టు... కీలక వ్యాఖ్యలు చేసింది.
అనాలోచితంగా వ్యవహరించారు: శ్రావణ్‌ను సాయంత్రం ఆరున్నర గంటలకు హాజరు పరిచినట్లు మేజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉదయం ఆరున్నరకు బదులు సాయంత్రం ఆరున్నరగా పొరపాటున నమోదైందని సీఐడీ తరపు న్యాయవాది చెబుతున్నారు. మేజిస్ట్రేట్ అనాలోచితంగా వ్యవహరించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులతో ముడిపడి ఉన్న వ్యవహారాలను విచారిస్తున్నామన్న విషయాన్ని మేజిస్ట్రేట్ తెలుసుకోవాలని పేర్కొంది.
శ్రావణ్‌పై ఐపీసీ సెక్షన్లతో పాటు డిపాజిటర్ల చట్టం కింద సీఐడీ నేరారోపణ చేసినట్లు మేజిస్ట్రేట్ చేతిరాతతో నమోదు చేశారు. ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం... ఏపీలో ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఈ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం జిల్లా జడ్జి హోదాతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి. ఈ కేసులను ఆ కోర్టు మాత్రమే విచారించాలి. కానీ మేజిస్ట్రేట్ తన పరిధిని విస్మరించారని హైకోర్టు తెలిపింది.
అశ్రద్ధగా ఉన్నారని స్పష్టమవుతోంది: విచారణ పరిధిలేకుండా, యాంత్రికంగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించి నప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని గతంలో 'గౌతం నవలఖ' కేసులో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మేజిస్ట్రేట్ రిమాండ్ విధింపు సమయాన్ని ఉదయం ఆరున్నరకు బదులు సాయంత్రం ఆరున్నరకు అని తప్పుగా నమోదు చేశారని అనుకున్నా.. ఈ వ్యవహారం డిపాజిటర్ల చట్టంతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తించాల్సిందని... అలా చేయకపోవడం ఆశ్రద్ధగా ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
శ్రావణ్‌ను రిమాండ్ విధించాలన్న సీఐడీ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకునే పరిధి మేజిస్ట్రేట్‌కు లేదని..రిమాండ్ ఉత్తర్వులు చట్టబద్ధమైనవి కాకపోయినా లేక విచారణాధికార పరిధి లేకపోయినా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. డిపాజిటర్ల చట్టం కింద నమోదు చేసిన కేసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టుకు మాత్రమే విచారించే పరిధి ఉంటుందని....ఆ ప్రత్యేక కోర్టు/ జడ్జిని మాత్రమే 'మేజిస్ట్రేట్'గా భావించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
సరిదిద్దుకోలేని తప్పు: వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించి.. చేసిన తప్పును తదుపరి చర్యల ద్వారా సరిచేసుకోలేరని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను చట్టప్రకారం సైతం హరించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. విజయవాడ సీఐడీ మార్చి 10న నమోదు చేసిన కేసులో శ్రావణ్‌కు బెయిల్ మంజూరు చేసింది. దర్యాపునకు సహకరించాలని పేర్కొంది.
ఇవీ చదవండి: