High Court fires on volunteer system : సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఎంపిక, వారి అర్హతలను నిర్ణయించే బాధ్యతను వాలంటీర్లకు కల్పించడంపై హైకోర్టు మండిపడింది. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాలు అమలు చేయలేదా? ప్రభుత్వ అధికారులు పథకాల లబ్దిదారులను ఎంపిక చేయలేదా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఏపీ చరిత్రలో సంక్షేమ పథకాల అమలు చేయడం ఇప్పుడేమీ మొదటిసారి కాదని గుర్తుచేసింది. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఉండగా.. వాలంటీర్లకు ఆ బాధ్యతను ఎలా అప్పగిస్తారంటూ విచారణకు హాజరైన గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సీఈవో ఇంతియాజ్‌ను నిలదీసింది.
ప్రభుత్వ అధికారులపై విశ్వాసం లేక వాలంటీర్లకు ఆ బాధ్యతను అప్పగించారా? లేదా ప్రభుత్వ అధికారులు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేరనా? అని సూటిగా ప్రశ్నించింది. వాలంటీర్ల ద్వారా ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వ యాప్‌లలో పొందుపరిచే అధికారం వాలంటీర్లకు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధార్, తదితర వివరాలను యాప్‌లలో పొందుపరిస్తే లబ్ధిదారుల వ్యక్తిగత భద్రత పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. సామాజిక సేవ కోసం వాలంటీర్లను నియమించామని చెబుతున్న ప్రభుత్వం.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాల సేకరణ, అర్హతలను నిర్ణయించే అధికారాన్ని వారికి ఎలా అప్పగిస్తారని వ్యాఖ్యానించింది. వివరాలు సేకరించడానికి వాలంటీర్లు ఎవరంటూ మండిపడింది. వృద్ధాప్యంలో ఉన్న వారిని చేయిపట్టుకొని ఆసుపత్రికి తీసుకెళ్లడం, చిన్న పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లి, తిరిగి తీసుకురావడం లాంటివి సామాజిక సేవ అవుతుంది కానీ.. లబ్దిదారులను ఎంపిక చేయడం, వారి అర్హతలను నిర్ణయించడం సామాజిక సేవ ఎలా అవుతుందని వ్యాఖ్యానించింది.