ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

HC On Rishikonda illegal Mining విశాఖ రుషికొండపై అక్రమ తవ్వకాల్లో ఉల్లంఘనలు నిజమే.. చర్యలపై కేంద్ర అటవీశాఖకు ఆదేశాలు.. - రుషికొండ లేటెస్ట్ న్యూస్

HC On Rishikonda illegal Mining: విశాఖలోని రుషికొండపై అక్రమ తవ్వకాలు, నిర్మాణాల్లో ఉల్లంఘటనలు జరగటం నిజమేనని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో తగిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర అటవీశాఖను ఆదేశిస్తామని వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే..

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 3, 2023, 7:14 AM IST

HC On Rishikonda illegal Mining: విశాఖలోని రుషికొండపై అక్రమ తవ్వకాలు, నిర్మాణాల్లో ఉల్లంఘనలు జరిగినట్లు నివేదికను పరిశీలిస్తే స్పష్టమవుతోందని హైకోర్టు పేర్కొంది. ఆ నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకునేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ (ఎంవోఈఎఫ్‌)ను ఆదేశిస్తామని తెలిపింది. నిర్మాణానికి అనుమతిచ్చిన అటవీ శాఖే ఉల్లంఘనల విషయంలోనూ చర్యలు తీసుకోవడం సబబని అభిప్రాయపడింది. నిర్మాణం దృఢత్వం కోసం కొండను తవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆ మేరకు అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఉల్లంఘనలపై తగిన చర్యల కోసం అటవీశాఖకు ఈ వ్యవహారాన్ని అప్పగిస్తూ తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. సుప్రీంకోర్టు అనుమతిచ్చిన విస్తీర్ణం వరకే రుషికొండపై నిర్మాణాన్ని పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాము జారీ చేయబోయే ఉత్తర్వుల్లో పునరుద్ఘాటిస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఏవీ శేషసాయిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

విశాఖలోని రుషికొండను టూరిజం రిసార్ట్ అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా తవ్వేస్తూ, పరిధికి మించి నిర్మాణాలు చేస్తున్నారంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్‌ పీవీఎల్‌ఎన్‌ మూర్తి యాదవ్‌ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరి తన వాదనలు వినాలని ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఎంవోఈఎఫ్‌ సంయుక్త కమిటీ.. రుషికొండ తవ్వకాలు, నిర్మాణాల్లో ఉల్లంఘనలునిజమేనని నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. 9.88 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతి తీసుకొని 17.96 ఎకరాల్లో పనులు చేస్తున్నారని తెలిపింది. బుధవారం హైకోర్టులో ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపించారు. అనుమతులకు మించి నిర్మాణాలు జరిపారని ఎంవోఈఎఫ్‌ సంయుక్త కమిటీ తేల్చిందన్నారు. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపారన్నారు. కొండను తవ్వి, నిషేధిత ప్రాంతంలో మట్టిని కుమ్మరించారన్నారు. ఉల్లంఘనలు నిజమేనని తేల్చిన ఎంవోఈఎఫ్‌ చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. నివేదిక ద్వారా ఉల్లంఘనలు నిజమేనని తేలిన నేపథ్యంలో రుషికొండపై ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలను నిలువరించాలని కోరారు.

ఉల్లంఘనలు నిజమేనని నిర్ధారణ అయ్యాక చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యలేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. సీనియర్‌ న్యాయవాది బదులిస్తూ.. పర్యావరణ చట్టం ప్రకారం రిసార్ట్ నిర్మాణ అనుమతులను వెనక్కి తీసుకోవచ్చన్నారు. బాధ్యులైన పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, ఇంజినీర్లను ప్రాసిక్యూషన్‌ చేయవచ్చన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్‌ స్పందిస్తూ 9.88 ఎకరాల పరిధిలోనే నిర్మాణాలు జరుపుతున్నామన్నారు. నిర్మాణాల దృఢత్వం కోసం అదనంగా కొండవాలును తవ్వామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ కొండపై పరిమితికి మించి తవ్వకాలు జరిపేందుకు అనుమతులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. సాంకేతిక అంశాల్లో తాము నిపుణులం కాదని, నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవహారాన్ని ఎంవోఈఎఫ్‌కే పంపుతామని పేర్కొంది. తగిన ఉత్తర్వులిచ్చేందుకు విచారణను వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details