ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ అంటూ నిపుణుల హెచ్ఛరికలు చేస్తుంటే.. మరోవైపు ప్రజలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్నారు వైద్యులు. అందుకే గుంటూరు నగరపాలక సంస్థ కరోనా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. నియమాలు ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
కరోనా లాక్డౌన్ కొద్ది కొద్దిగా తెరుచుకోవడంతో జనం మళ్లీ యధావిథిగా రోడ్లపైకి వచ్చేశారు. సభలు, సమావేశాలు, షాపింగ్లు అంటూ కార్యకలపాలు కొనసాగిస్తున్నారు. అయితే వీటిలో ఎక్కడా కూడా భౌతికదూరం... మాస్కులు ధరించడం వంటివి కనిపించకపోవడం భయాందోళన కలిస్తోంది. ఇక కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కేసులు ఎక్కువగా వస్తోన్న గుంటూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితి కనిపించడం అధికారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో నియంత్రణ చర్యల్లో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 70వేలు కేసులు దాటగా... వాటిల్లో 20వేలు కేసులు నగరంలో నమోదైనవే. లాక్ డౌన్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ అన్ లాక్ మొదలయ్యాక క్రమేపీ అప్రమత్తత తగ్గుతోంది. కొందరు మాస్కులు ఉన్నా గొంతుపైకి వేలాడదీస్తున్నారే తప్ప.. క్రమంగా మాస్కులు ధరించడం లేదు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు మాస్క్ ధరించటం లేదు. దీంతో ఇద్దరిలో ఎవరికి వైరస్ ఉన్నా రెండో వారికి సులువుగా వైరస్ సోకే ప్రమాదం లేకపోలేదు.