ఒంటరిగా ఉండే మహిళల మెడలో బంగారపు వస్తువులు దోపిడీ చేస్తున్న ముగ్గురిని గుంటూరులోని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 గ్రాముల బంగారపు వస్తువులు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. మే 10న విద్యానగర్ మూడో లైన్లోని ఓ ఇంట్లో వృద్ధురాలిని బెదిరించి బంగారపు మంగళసూత్రం, గొలుసు దోచుకెళ్లిన వైనంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మే 19 న జేకేసీ కళాశాల రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారపు ఆభరణాలు తెంచుకెళ్లిన ఘటనపై కేసు నమోదైంది. నేర విభాగం ఏఎస్పీ మనోహరరావు, డీఎస్పీ ప్రశాంతి, సీఐ ప్రేమయ్య.. దర్యాప్తు చేసి ముగ్గురిని నిందితులుగా గుర్తించారు. నగరంపాలేనికి చెందిన పఠాన్ మహబూబ్ సుభాని, వల్లేరు క్రాంతి, కుర్రా అనిల్ కుమార్.. వ్యసనాలను బానిసలయ్యారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారపు వస్తువులు దోపిడీలకు పాల్పడుతుండేవాళ్లు.