గుంటూరు నగరంలో మురుగు కాలువలపై ఆక్రమణలు, సెల్లార్లలో వాణిజ్య కార్యకలాపాలపై నగరపాలక సంస్థ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. తెదేపా కార్పొరేటర్ వేములపల్లి శ్రీ రాంప్రసాద్ ఈ విషయాన్ని లేవనెత్తారు. అధికారులు ఈ విషయం గురించి వివరణ ఇవ్వాల్సి ఉండగా.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సమాధానం ఇచ్చేందుకు యత్నించారు. ఈ సందర్భంగా కాసేపు వాగ్వాదం జరిగింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కూడా అక్రమణలకు ఎవరు పాల్పడినా తొలగించాలని డిమాండ్ చేశారు.
దాదాపు గంటపాటు ఈ అంశంపై వాదోపవాదనలు జరిగాయి. సమస్య పరిష్కారానికి కార్పొరేషన్ తరపున చర్యలు తీసుకుంటామని మేయర్ కావటి మనోహరనాయుడు స్పష్టం చేశారు. వాణిజ్య సముదాయాల్లోని సెల్లార్లు తప్పనిసరిగా పార్కింగ్ కోసమే వినియోగించాలన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరించటం సరికాదని చెప్పారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయాలని.. సరిగా స్పందించకపోతే అక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు.