ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన గుంటూరు మిర్చియార్డుకు ఏటా సీజన్‌లో వేల మంది రైతులు మిర్చి తెస్తుంటారు. వందల కోట్ల లావాదేవీలతో మార్కెట్‌కు పన్నురూపంలోనే ఏటా 6 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఏటికేడు ఆదాయం పెరుగుతున్నా..రైతులకు అందాల్సిన సౌకర్యాలు మాత్రం అటకెక్కుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతుల కోసం 2008లో మిర్చియార్డులో...ఉచిత భోజన పథకం ప్రారంభించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు...రెండు కూరలు, మజ్జిగతో భోజనం పెట్టేవారు. ఈ ఏడాది ఉచిత భోజనం పథకాన్నీ ఆపేశారు. తాగునీటి కోసం...యార్డులో 8 చోట్ల ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినా సరైన నిర్వహణ లేక అవీ మూతపడ్డాయి. రైతులు సమీపంలోని దుకాణాలకు వెళ్లి దాహార్తి తీర్చుకుంటున్నారు.
రైతుల కోసం మూడంతస్తుల్లో నిర్మించిన విశ్రాంతి భవనంలో.. సౌకర్యాలు లేవు. పగటిపూట విశ్రాంతి భవనంలోకి అనుమతించటంలేదు. ఎండ ఎక్కువగా ఉండటంతో....చెట్ల కిందే సేద తీరాల్సిన పరిస్థితి. రాత్రిళ్లూ కొందరినే అనుమతిస్తున్నారని రైతులు వాపోతున్నారు.