కరోనా మహమ్మారి దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపిందని... గుంటూరు జిల్లా హిందూ కళాశాల ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. కళాశాల తరపున వారు సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ప్ర. సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలేమిటి? పేద వర్గాలపై కరోనా చూపిన ప్రభావమేంటి?
జ. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది. అయితే మన దేశంలో ఈ కరోనా ఆర్థికంగా ఎలాంటి సమస్యలు సృష్టించింది అనే అంశంపై సర్వే చేపట్టాం. ఆన్ లైన్ విధానంలో ఈ సర్వే నిర్వహించారు. 17 రాష్ట్రాలు, 95 జిల్లాలకు చెందిన 532 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వారి సూచనలు, ఆలోచనలు తెలియజేశారు. లాక్ డౌన్ పేద ప్రజలపై అధిక ప్రభావం చూపింది. ధనికులు... ఉన్న డబ్బు వాడుకున్నారు. పేదలు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు.
ప్ర.లాక్ డౌన్ సమయంలో ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి?
జ. సర్వేలో పాల్గొన్న వారిలో 40శాతం మందిలో 60నుంచి 100శాతం మేర ఆదాయం తగ్గింది. కేవలం 18శాతం మందికి మాత్రమే ఆదాయంలో ఎలాంటి మార్పులు లేవు. అలాగే కుటుంబ వ్యయాల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. వ్యయంలో చాలా తగ్గుదల కనిపించింది. బయటి నుంచి ఆహారం తెచ్చుకోవటం, సౌందర్య సాధనాలు, వస్త్రాలు, ఆభరణాలపై వ్యయం తగ్గింది. కిరాణా సరుకులు, పోషకాహారం, ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులపై ఖర్చు పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచే వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తేలింది.
ప్ర.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంపై ఏమన్నారు?
జ.సర్వేలో పాల్గొన్న వారు ఎక్కువమంది మధ్యతరగతి వర్గాల వారే. బ్యాంకు రుణాల చెల్లింపు వాయిదా, ఆదాయపు పన్ను రద్దు వల్ల కొందరు లబ్ది పొందారు. రేషన్, ప్రత్యక్ష ఆదాయ పథకాల వల్ల మరికొందరికి ప్రయోజనం కలిగింది.రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ప్రభావం కనిపించింది.
ప్ర. సర్వేలోని అంశాల ఆధారంగా మీరిచ్చే సూచనలు ఏమిటి?
జ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల దాదాపు 63శాతం మంది ఏదో ఒక విధంగా ప్రయోజనం పొందారు. అలాగే ప్రతి ఒక్కరికి 3నుంచి 5వేల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని వారు కోరుతున్నారు. అలాంటి సాయం ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం. నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలోకి డబ్బులు రావాలి. తెలంగాణా సీఎం కేసీఆర్ చెప్పినట్లు హెలికాఫ్టర్ మనీ వంటివి రావాలి.
ప్ర. ప్రైవేటు సెక్టార్లోని ఏయే రంగాలు ప్రధానంగా దెబ్బతిన్నాయి? అవి కోలుకోవాలంటే ఏం చేయాలి?
జ. విద్యారంగంపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఎప్పుడు స్కూళ్లు, కళాశాలలు ప్రారంభం అవుతాయో చెప్పలేని పరిస్థితి. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వినోద రంగానికి సంబంధించి... సినిమా హాళ్లు, అమ్యూజ్మెంట్ పార్కుల్లో పనిచేసే వారు, పర్యటక రంగానికి సంబంధించిన వారు కూడా ఉపాధి కోల్పోయారు. అలాంటి వారిని ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలి. చేతివృత్తుల వారికి ఇచ్చిన విధంగానే వీరందరికీ ప్రత్యక్ష ఆర్థిక సహకారం అందించాలి. పారిశ్రామిక రంగానికి సంబంధించి ఇప్పటికిప్పుడు ప్రభావం కనిపించకపోయినా... భవిష్యత్తులో చాలా నష్టపోతాయి. నిరుద్యోగ సమస్య తలెత్తనుంది. ప్రభుత్వాల సహకారం వల్లే అవి తిరిగి కోలుకోగలుగుతాయి.
ప్ర. ప్రజల ఆలోచనల్లో కరోనా ఎలాంటి మార్పు తెచ్చింది?
జ. నిజంగా కరోనా ప్రజల్లో చాలా మార్పు తెచ్చింది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పెరిగాయి. కరోనా నివారణలో ప్రభుత్వం కన్నా ప్రజల బాధ్యత ఎక్కువని వెల్లడైంది. ప్రభుత్వం రూపొందించే పథకాలు, ప్రణాళికలు అమలు చేయాల్సింది ప్రజలే. అందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. వారిలో బాధ్యత పెరిగింది.