గుంటూరు జిల్లాలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 19కేసులు నమోదు కావటంతో మొత్తం కేసుల సంఖ్య 306కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో నరసారావుపేటలో 17, గుంటూరు1, ధూలిపాళ్లలో ఒకటి ఉన్నాయి. తాజా కేసులతో కలిపి నరసారాపేటలో పాజిటివ్ సంఖ్య 121కి చేరింది. ఇక్కడ వరవకట్ట ప్రాంతంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక గుంటూరు నగరంలోనూ పాజిటివ్ కేసులు 146కి చేరుకున్నాయి. జిల్లాలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకూ 97మంది ఇళ్లకు వెళ్లారు. ఇంకా 201 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కరోనా వచ్చిన వారికి గుంటూరు ఐడి ఆసుపత్రి, మంగళగిరి ఎన్.ఆర్.ఐ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా గుంటూరు జీజీహెచ్ తో పాటు, లలిత ఆసుపత్రి, తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి, వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రి, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ 19కు చికిత్స అందించాలని నిర్ణయించారు. అక్కడ వైద్య సిబ్బందితో పాటు ఇతర పరికరాలను సిద్ధం చేశారు.