Guntur District Yuddh People Worried on Israel Palestine War: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం గుంటూరు జిల్లాలో కొందరిని కలవరపెడుతోంది. వందల ఏళ్ల క్రితం ఇక్కడకు వలస వచ్చిన యూదులు తమ పూర్వభూమి ఇజ్రాయెల్‌పై జరిగిన దాడితో కలత చెందుతున్నారు. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నారు. ఎక్కడి యూదులు? ఇక్కడికి ఎందుకొచ్చారు? ఏం చేస్తున్నారు? తెలుసుకుందాం రండి.
300 ఏళ్ల క్రితం తెలంగాణా ప్రాంతానికి వచ్చిన యూదులు అక్కడి ద్రాక్ష తోటలో పని చేశారు. ఆ తర్వాత అమరావతి సంస్థానానికి తరలివచ్చారు. వీరిలో కొందరు తిరిగి వెళ్లిపోయారు. మూడు కుటుంబాల వారు మాత్రం చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో స్థిరపడ్డారు. ఆ కుటుంబాలు ఇప్పుడు 40కి చేరుకున్నాయి. వారి జనాభా 200వరకు ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీనాకు మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం వీరిపై పడింది. ఇజ్రాయెల్‌లో ఉన్న తమ ఆత్మీయుల భద్రతపై వీరు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం త్వరగా ముగిసిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
"1909లో ఇక్కడ సమాజ మందిరం నిర్మాణం చేసుకున్నారు. మేము తక్కువ జనాభా కాబట్టి.. గుర్తింపు లేకుండా ఎవరికి తెలియకుండా ఉండాలని నేర్పించే వాళ్లు. ప్రార్థనలు చేస్తున్నప్పుడు హమాస్ వాళ్లు వచ్చి.. దాడి చేసినట్లు తెలుసుకున్నాము. ఇక్కడ ఉన్న 40కుటుంబాల వాళ్లము ఇజ్రాయెల్‌లో ఉన్న మా వారికోసం ఉపవాస ప్రార్థనలు చేశాము." -యాకోబీ సాదోక్, యూదుల మతపెద్ద, కొత్తరెడ్డిపాలెం
అమెరికాలో యూదులు, ముస్లింల తర్వాత సిక్కులే
యూదుల్లో మొత్తం 12 గోత్రాలకు చెందినవారుంటారు. కొత్తరెడ్డిపాలెంలో నివసించే వీరు ఎఫ్రాయిమ్ గోత్రీకులు. వీరంతా 1909లోనే ఇక్కడ ప్రార్థనా మందిరం ఏర్పాటు చేసుకున్నారు. యూదు పండుగలు, ఉత్సవాలు నిర్వహించుకుంటారు. హీబ్రూ భాషలో ప్రార్థనలు చేస్తుంటారు. వీరందరూ తెలుగులోనే మాట్లాడతారు. ఇక్కడి ప్రజలతో కలిసిపోయే ఉంటారు.
"లోకంలో ఎవరి దేవతలను వారు పూజిస్తున్న.. లోకంలో అందరి కోసం మేము ప్రార్థనలు చేస్తుంటాం. హమాస్ దాడి చాలా బాధాకరం. పరిస్థితి అలా వచ్చింది. మేము చాలా దుఃఖించాము." -అబ్రహాం మతన్యా, యూదు మతస్థుడు, కొత్తరెడ్డిపాలెం