Women's International Master title winner: గుంటూరు జిల్లాకు చెందిన బొమ్మిని మౌనిక అక్షయ అనే చిన్నారి ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్‌ని సొంతం చేసుకుంది. మౌనిక అమ్మానాన్నలు ప్రైవేటు ఉపాధ్యాయులు. కాలక్షేపం కోసం అప్పుడప్పుడు చదరంగం ఆడేవాళ్లు. చిన్నారి మౌనిక ఆసక్తిగా గమనించేది. దాంతో తనకీ మెల్లగా ఆటను పరిచయం చేశారు. తమకు తెలిసిన వ్యూహాలు, ఎత్తుగడలు నేర్పించారు. అన్నింటినీ ఒడిసిపట్టి తనకన్నా పెద్దవయసు వాళ్లని అవలీలగా ఓడించేది. ఆ ప్రతిభకు అంతా ఆశ్చర్యపోయేవాళ్లు. మంచి శిక్షణ ఇప్పిస్తే కూతురు మేటి క్రీడాకారిణి అవుతుందని భావించిన ఆ తల్లిదండ్రులు గుంటూరులోనే ఒక ప్రముఖ కోచ్ దగ్గర చేర్పించారు. ఆయన శిష్యరికంలో రాటుదేలింది. బడికెళ్తూనే ఖాళీ సమయంలో మనసంతా అరవై నాలుగు గళ్లపై పెట్టేది. మెల్లగా జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటూ సత్తా చూపింది. పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో నిర్వహించిన అండర్-7 రాష్ట్రస్థాయి పోటీల్లో తొలిసారి కాంస్యపతకం సాధించింది. ఆపై రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో దూసుకెళ్తోంది.
ఇంటి నిర్మాణం ఆపేసి..
చదరంగం ఆటలో రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. ఆర్థిక సహకారమూ తప్పనిసరి. రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ పోటీల్లో పాల్గొనాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అరకొర జీతంతో కుటుంబం నెట్టుకొస్తున్న మౌనిక తల్లిదండ్రులకు ఇది తాహతుకు మించిన వ్యవహారమే. దీన్ని గమనించి ఇరుగూపొరుగూ, బంధువులు ‘ఆడపిల్లకు అంత వ్యయప్రయాసలు, ఖర్చుతో కూడుకున్న ఆట అవసరమా?’ అంటూ నిష్ఠూరమాడేవాళ్లు. కూతురి భవిష్యత్తే ముఖ్యం అనుకున్న కన్నవాళ్లు ఆ మాటలు పట్టించుకోలేదు. చివరికి సొంతింటి నిర్మాణం కోసం దాచుకున్న నగదుతో కుమార్తెను విదేశాల్లో జరిగే పోటీలకు పంపుతున్నారు. కన్నవాళ్ల త్యాగాన్ని ప్రతిక్షణం గుర్తు చేసుకునే మౌనిక.. పంచప్రాణాలు ఆటపైనే పెట్టి మిన్నగా రాణిస్తోంది. ఇప్పటికే మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా అందుకున్న తను.. త్వరలోనే చిరకాల స్వప్నం మహిళా గ్రాండ్‌మాస్టర్ హోదా సంపాదిస్తానంటోంది. దీనికోసం గ్రాండ్ మాస్టర్‌లు స్వయంత్ మిశ్రా, శ్యామ్‌సుందర్‌ల పర్యవేక్షణలో ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకుంటూ నైపుణ్యాలు మెరుగు పరుచుకుంటోంది.