Group-3 Notifiaction In Telangana: తెలంగాణలో జులై లేదా ఆగస్టులో గ్రూపు-3 పరీక్ష జరగనుంది. ఈ మేరకు మొత్తం 1365 ఖాళీల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం రాత్రి ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు ఫిబ్రవరి 23 వరకు గడువిచ్చారు. టీఎస్‌పీఎస్‌సీ తన వెబ్‌సైట్లో సవివర నోటిఫికేషన్‌ను పూర్తి వివరాలతో పాటు దరఖాస్తుల కోసం లింక్‌ను కూడా పొందుపరిచింది.
అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి అభ్యర్థి 12 కేంద్రాలను ప్రాధాన్యం వారీగా ఎంపిక చేసుకోవచ్చు. మూడు పేపర్లకు 450 మార్కులు ఉంటాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష జరుపుతారు. వీటిలో అత్యధికంగా ఆర్థికశాఖలోనే 712 పోస్టులు ఉన్నాయి. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, వేతన స్కేలు, రిజర్వేషన్లు తదితర వివరాలతో ఈ మంగళవారం నుంచి వెబ్‌సైట్లో సమగ్ర నోటిఫికేషన్‌ను పొందుపరిచారు.
గ్రూప్ 3కి శాఖల వారిగా వివరాలు ముందస్తు ప్రణాళికతో.. గ్రూప్ ఉద్యోగ ప్రకటనలన్నీ డిసెంబరు 31లోగా జారీ చేయాలని టీఎస్‌పీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుని అందులో విజయం సాధించింది. ఛైర్మన్ గ్రూప్ ఉద్యోగాల శాఖలతో సమావేశమై ఈ ప్రక్రియను వేగవంతం అయ్యేలా కృషి చేశారు. గ్రూప్-4, 2, 3 ప్రకటనలు ఒక లక్ష్యం మేరకు జారీ చేసేలా ప్రణాళిక రచించారు. సాధారణంగా గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయాలంటే 33 జిల్లాల నుంచి 70 విభాగాల సమన్వయం అవసరం. ఈ ప్రక్రియ పూర్తికావడానికి కనీసం అయిదారు నెలల సమయం పడుతుంది.
కానీ ముందుగానే ప్రకటన విడుదల చేసి, ఆ మేరకు ప్రతిపాదనలు నిర్ణీత గడువులోగా తెప్పించేందుకు ప్రయత్నం చేశారు. గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆలస్యం అయినప్పటికీ.. ఇప్పుడు సాగుతున్నాయి. గ్రూప్-2, 3 పోస్టులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ విభాగాల నుంచి పూర్తి వివరాలు తెప్పించి, నిబంధనల ప్రకారం సరిగా ఉన్నాయో లేదా పరిశీలించిన తరువాతే ప్రకటనలు వెలువరించింది. గ్రూప్-2, 3, 4 పోస్టులు ప్రభుత్వం నుంచి అదనంగా వస్తే, వాటిని ఈ పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు వీలుగా ప్రకటనలోనే నిబంధన ద్వారా వెసులుబాటు కల్పించింది.
సన్నద్ధతకు మరింత సమయం... గ్రూప్-1 సమయంలో ఉద్యోగార్థులు తమకు తగినంత సమయం ఇవ్వాలంటూ విజ్ఞప్తులు పంపారు. కమిషన్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రూప్-4, 2, 3 ప్రకటనల విషయంలో ముందుకు వెళ్తోంది. ప్రతి పరీక్షకు కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం ఇస్తూ పరీక్ష తేదీలు ప్రాథమికంగా నిర్ణయించింది. ఇతర పోటీ పరీక్షలకు ఆటంకం లేకుండా షెడ్యూలు రూపొందిస్తోంది. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన వెంటనే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షల పరంపర కొనసాగనుంది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. ఈ ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. ప్రధాన పరీక్షకు కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని యోచిస్తోంది. తాజా ఈ గ్రూప్3 పరీక్షకు 6నెలలు సమయం ఇవ్వడం ఉద్యోగార్థుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.
ఇవీ చదవండి: