AP TIDCO Houses: పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ పేదల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు అదే పేదలకు ఇచ్చిన స్థలాలను అమ్మేయనున్నారు. అదే పేదల ఇళ్ల కోసం గత ప్రభుత్వం కేటాయించిన భూముల విక్రయానికి సిద్ధమయ్యారు. కొందరి పేదల ఇళ్ల స్థలాలను అమ్మి.. మరికొందరు పేదలకు ఇళ్లు కట్టించడమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. టీడీపీ ప్రభుత్వంలో 60 నుంచి 90 శాతంపైగా పూర్తయిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించకుండా నాలుగేళ్లుగా కాలయాపన చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఆగమేఘాలపై పూర్తిచేసి ఇచ్చేందుకు సరికొత్త ఎత్తులు వేస్తోంది. ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా కేటాయించకుండా.. 260 ఎకరాల టిడ్కో భూముల అమ్మకానికి తెగబడ్డారు. టిడ్కో ఇళ్ల పూర్తి కోసం హడ్కో నుంచి సేకరించే 750 కోట్ల రూపాయల రుణాన్ని ఈ భూములను అమ్మి తీరుస్తామంటూ ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేసింది.
Gudivada TIDCO Houses: లబ్ధిదారులకు అందని తాళాలు.. మందుబాబులకు ఆవాసాలుగా టిడ్కో ఇళ్లు
తెలుగుదేశం హయాంలో 3.13 లక్షల టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టగా.. జగన్ అధికారంలోకి రాగానే 51,616 ఇళ్లను రద్దు చేశారు. 25 శాతం లోపు పనులు పూర్తయిన నిర్మాణాలను రద్దుచేస్తున్నామంటూ నిబంధనలు విధించింది. ఆ విధంగా 51వేల 616 ఇళ్లను రద్దు చేయగా.. 260.74 ఎకరాల భూమి మిగిలిపోయింది. ఇప్పుడు ఆ భూములను అమ్మి.. మిగిలిన పేదల ఇల్లు నిర్మించనున్నట్లు సమాచారం. ఈ భూముల విలువ మొత్తం 386 కోట్ల రూపాయలు కాగా.. 15 ఏళ్ల తర్వాత వీటి విలువ సుమారు 1,500 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా వేశారు. హడ్కో నుంచి తీసుకునే 750 కోట్ల రూపాయల రుణాన్ని ఈ 15 ఏళ్లలో భూములను విక్రయించి కడతామనేది ఒప్పందం. టిడ్కో భూముల్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలిసింది. ఈ విధంగా విక్రయించనున్న భూముల్లో అత్యధికం రాయలసీమ జిల్లాల్లోనే ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 140 ఎకరాల భూమిని విక్రయించనుండగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 47 ఎకరాలు, నెల్లూరు 25, కృష్ణా 15, శ్రీకాకుళంలో 12 ఎకరాలను విక్రయించనున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ పది ఎకరాల లోపు టిడ్కో భూములను విక్రయానికి పెట్టారు.