ఫేస్ బుక్ స్నేహం... ఓ అబ్బాయి ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకూ దారి తీసింది. గుంటూరులో వెలుగు చూసిన ఈ ఘటన.. సామాజిక మాధ్యమాల ప్రభావం యువతపై ఎలా పడుతోందన్నదీ స్పష్టం చేస్తోంది. ఓ అమ్మాయి.. ఓ అబ్బాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి.. తర్వాత స్నేహం చేసి.. ఆఖరికి పెళ్లి చేసుకోవాలని బెదిరించడమే కాదు.. పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానని భయపెట్టిందని బాధితుడి తల్లి పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే..
గుంటూరుకు చెందిన ఓ యువకుడు బీఎస్సీ చదువుతున్నాడు. ఇటీవల వినుకొండకు చెందిన ఓ యువతి ఫేస్‌బుక్‌లో అతనికి ఫ్రెండ్ రిక్వెస్టు పంపగా.. అతను ఓకే చేశాడు. ఇద్దరి మధ్య 3 నెలలుగా ఛాటింగ్ నడిచింది.
అకస్మాత్తుగా:
బాధిత కుటుంబం చెబుతున్న ప్రకారం... సదరు యువతి నెల క్రితం.. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందామని అడిగింది. "మనం స్నేహితులమే కదా.. మరి పెళ్లి అంటావేంటి?" అని అతను ప్రశ్నించాడు. దీనికి ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాహం చేసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరించింది. ఆ యువకుడు భయపడిపోయాడు. జరిగిన విషయాన్ని తన తల్లికి వివరంగా చెప్పాడు.
ఒకే ఒక్కడు:
బాధితుడి తల్లికి ఒక్కడే కుమారుడు. అతడిపైనా ఆమె ఆశలన్నీ. తన రెక్కల కష్టంతో చదివిస్తోంది. అకస్మాత్తుగా తన కుమారుడ్ని చంపేస్తామని ఓ అమ్మాయి నుంచి బెదిరింపు రావడంపై ఆందోళనకు గురైంది. అమ్మాయి తల్లిదండ్రులను కలిసి విషయాన్ని వివరించింది.