గుంటూరు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారి పక్కన ఉన్న దళిత, క్రైస్తవుల స్మశానవాటికలో ముందస్తుగా ఎటువంటి సమాచారం లేకుండా.. పురపాలక సంఘం అధికారులు సమాధులు కూల్చిన ఘటన వెనుక కుట్ర ఉందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుమానం వ్యక్తంచేశారు. సంఘ పెద్దలకు, సమాధులకు చెందిన వారసులకు ముందుగా నోటీసులు అందించి, వారి అనుమతితో పెద్దల సమక్షంలో చేయాల్సిన పనిని ఏకపక్షంగా ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఈ ఘటనతో ఆయా మతాలకు చెందినవారి మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
రాష్ట్రంలో ఇటీవల కాలంలో సున్నితమైన నమ్మకాలతో ముడిపడిన మతపరమైన అంశాలలో పలు వివాదాలు జరగడం దురదృష్టకరమన్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవులలో ఉన్నవారు మతాలను, నమ్మకాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదని హితవుపలికారు. పట్టణంలో జరిగిన సమాధుల విధ్వంసం ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.