మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య
22:08 January 23
తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ చెన్నకేశవులు
EX Home Minister Driver Suicide:రాష్ట్ర మాజీ హోంమంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కారు డ్రైవర్ పి.చెన్నకేశవరావు (45) పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుంటూరు బ్రాడీపేటలో చోటుచేసుకుంది. సుచరిత నివాసానికి కొద్దిదూరంలో ఉన్న ఓ హాస్టల్‌లో ఆమె అంగరక్షకులు, కారు డ్రైవర్లు ప్రత్యేకంగా ఓ గది తీసుకుని ఉంటున్నారు. పగలంతా ఎమ్మెల్యేతో పాటు విధి నిర్వహణలో ఉండి రాత్రికి విధులు ముగించుకుని కారు డ్రైవర్ చెన్నకేశవరావు తొలుత గదికి చేరుకోగా ఆ తర్వాత వ్యక్తిగత భద్రతాధికారి(పీఎస్‌ఓ) రామయ్య వచ్చారు. రామయ్య గదికి వచ్చాక తన పిస్టల్‌ను తీసి దిండు కింద పెట్టుకుని స్నానం చేయటానికి వెళ్లారు. ఆ పిస్టల్ తీసుకుని చెన్నకేశవురావు నుదుటి భాగంలో కాల్చుకుని చనిపోయాడు. కాల్పుల మోత విని స్నానాల గది నుంచి బయటకు రాగా రామయ్య రక్తమోడుతూ కనిపించారు. అప్పటికే చనిపోయినట్లు భావించి ఆయన ఎమ్మెల్యే సుచరిత ఇంటికి వెళ్లి విషయం చెప్పారు. ఆమె నేరుగా గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఘటనా ప్రదేశానికి వచ్చి పరిశీలించారు. క్లూస్‌టీం బృందాలను పిలిపించి ఆధారాలు సేకరించాలని ఆదేశించి ఆయన వెనుదిరిగారు. క్లూస్ టీం బృందాలు రాత్రి 10 గంటల తర్వాత అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించాయి. ఆ తర్వాత కుటుంబీకులకు సమాచారమివ్వడంతో వారు అక్కడకు వచ్చారు. అనంతరం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రికి తరలించారు.
ఆర్థిక ఇబ్బందులు! :మృతుడు చెన్నకేశవరావు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటారని సహచర ఉద్యోగులు చెబుతున్నారు. తరచూ తనకు అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చలేకపోతున్నానని అంటుండేవాడని సమాచారం. అయితే ఆర్థిక ఇబ్బందులకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఒకవైపు అప్పులు మరోవైపు కుటుంబంలో ఆస్తిగొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని సమాచారం. ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్‌గా ఉంటూ సుచరితకు గత కొంతకాలం నుంచి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మృతుడికి భార్య, డిగ్రీ చదివే వయస్సున్న కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి కుటుంబం నగరంలోని ఏటీ అగ్రహరంలో నివాసం ఉంటోంది. చెన్నకేశవరావు మృతి చెందిన విషయం పోలీసులు తెలియజేయగానే కుటుంబీకులు, బంధువులు ఘటనా ప్రదేశానికి చేరుకుని బోరున విలపించారు. సుమారు మూడు గంటల పాటు మృతదేహాన్ని హాస్టల్ గది వద్దే ఉంచారు. నేర విభాగం ఏఎస్పీతో పాటు నగరంలోని పలువురు డీఎస్పీలు, సీఐలు ఘటనా ప్రదేశానికి వచ్చారు.
ఇవీ చదవండి: