శ్రీశైలం ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆ ప్రభావంతో నాలుగురోజుల్లోనే నాగార్జున సాగర్ గరిష్ఠ నీటిమట్టానికి చేరువైంది. సాగర్ చరిత్రలో పదేళ్ల తర్వాత తొలిసారిగా మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. దిగువకు పెద్దఎత్తున వరదనీటిని విడిచిపెట్టడంతో.. పులిచింతల ప్రాజెక్టుకు 3 లక్షలకు పైగా వరదనీరు వచ్చి చేరుతుంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45 టీఎంసీలు కాగా.. క్రమంగా నీరు చేరుతుండటంతో వేగంగా ప్రాజెక్టు నిండుతోంది. ఈ పరిస్థితుల్లో ముంపు గ్రామాలపై అధికారులు దృష్టి పెట్టారు.
వరద పరిస్థితి దృష్ట్యా కృష్ణా జిల్లా పరిధిలో ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ మాధవీలత టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నందున దిగువ ముంపు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తం కావాలని హెచ్చరించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రధానంగా బెల్లంకొండ మండలంలోని గ్రామాలు ముంపు సమస్య ఎదుర్కొంటున్నాయి. వేమవరం, రేగులగడ్డ, వెల్లంపల్లి, ఎమ్మాజీగూడెం గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మాచవరం మండలంలోని లోతట్టు గ్రామాలు, 7 లక్షలకు పైగా ప్రవాహముంటే సమస్య ఎదుర్కొనే డెల్టా లంక గ్రామాలపైనా జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. వరదలపై అన్నివిధాలా పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ తెలిపారు.