గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్ తీరంలో ఐల చేపల వేట ఆశాజనకంగా సాగుతోంది. ప్రతి ఏటా జనవరి నుంచి మార్చి వరకు సముద్రపు ఒడ్డుకు చేరువలో మత్స్యకారులు ఈ వేటను కొనసాగిస్తారు. సాధారణ చేపల వేటను జాలర్లు.. వారం రోజుల పాటు చేస్తుంటారు. కానీ ఐల వేటకు.. జాలర్లు ఉదయం సముద్రం లోనికి వెళ్ళి.. వేట ముగించుకుని రాత్రికి ఒడ్డుకు చేరుకుంటారు.
అందుకోసం 40 నుంచి 50 మంది వరకు మత్స్యకారులు గ్రూపుగా ఏర్పడి ఈ వేట సాగిస్తారు. ఆయిల్ మత్తిగా పిలిచే ఈ చేపలను నూనె తీసేందుకు ఉపయోగిస్తారు. రోజుకు సుమారు 60 టన్నుల వరకు కేరళకు ఎగుమతి చేస్తుంటామని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ వేట కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు.