విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీతో... ముఖ్యమంత్రి జగన్ తొలిసారిగా సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో... విద్యాశాఖ సంస్కరణల కమిటీ ఛైర్మన్ బాలకృష్ణన్ సహా సభ్యులు, విద్యారంగ నిపుణులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థను అత్యున్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న జగన్.. తమ ఆలోచనలు, తీసుకురావాలనుకున్న మార్పులు వివరించారు. అమ్మఒడి, బోధనా ఫీజుల విధానం ప్రస్తావించారు. విద్యార్థుల బోర్డింగ్, లాడ్జింగ్ కింద ఏటా 20వేల రూపాయలు అందిస్తామని చెప్పారు. నిరక్షరాస్యత ఉండకూడదని, డ్రాపవుట్స్ అన్నదే లేకుండా చేయాలన్నారు. రెండు మూడేళ్లలో పాఠశాలల రూపురేఖలు మార్చేస్తామని సీఎం తెలిపారు.
త్వరలోనే ఫీజుల నియంత్రణ వ్యవస్థ కోసం చట్టం - fees controlling system act
రాష్ట్ర విద్యావ్యవస్థ దేశానికి ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అత్యుత్తమ విధాల రూపకల్పనే లక్ష్యంగా తగిన సిఫార్సులు చేయాలని విద్యాశాఖ సంస్కరణల కమీటిని కోరారు. 4 నెలల్లో సమగ్ర నివేదిక అందించాలని గడువు విధించారు.
కనీస సదుపాయాలు కల్పించి... మధ్యాహ్న భోజనం నాణ్యత బాగా పెంచేలా... ప్రభుత్వం చెల్లిస్తోన్న ధర పెంచే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థికి 3 జతల ఏకరూప దుస్తులు, బూట్లు ఇస్తామన్నారు. మధ్యాహ్న భోజనం తయారీని పట్టణ ప్రాంతాల్లో అక్షయపాత్రకు, గ్రామాల్లో డ్వాక్రా సంఘాలతోనే సిద్ధం చేయించాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలకూ విద్యాకమిటీ, పాఠశాల అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మరుగుదొడ్లు శుభ్రం చేసేవారికి 4వేల రూపాయలు, శుభ్రత సామగ్రి కోసం వెయ్యి రూపాయలు కేటాయించాలని స్పష్టంచేశారు.