R-5 Zone Issue: రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి.. ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు. ఆర్-5జోన్‌లో భాగంగా మంగళగిరి మండలం కురగల్లులో కొందరు రైతులు.. తమ భూముల్లో ప్లాట్లు వేసి పాతిన హద్దు రాళ్లను పీకేశారు. తమ రిటర్న్‌బుల్ ప్లాట్ల అభివృద్ధి సంగతేంటో తేల్చాలని డిమాండ్ చేశారు. కనీసం కౌలు కూడా ఇవ్వకుండా.. తామిచ్చిన భూములను ఎవరికో పందేరం చేస్తామంటే ఎలాగని రైతులు నిలదీశారు.
ఎడారి, శ్మశానంతో పోల్చిన అమరావతిలో పేదలకు ఎలా స్థలాలు ఇస్తున్నారని.. రైతులు ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల తీరును మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. అమరావతి.. ఆర్-5 జోన్ విషయంలో ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుకుంటుందని స్పష్టం చేశారు.
ఆర్-5 జోన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా ప్రభుత్వం ఆగాలని.. రైతులు డిమాండ్ చేశారు. కృష్ణాయపాలెంలో నాలుగోరోజూ.. రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఆర్-5 జోన్‌పై గ్రామ సభల్లో వ్యక్తమైన అభిప్రాయాలు పట్టించుకోకుండా.. ప్రభుత్వం ముందుకు వెళ్తోందంటూ మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు.
అమరావతి ఓ బ్రహ్మపదార్ధమా అంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై రాజధాని రైతులు తీవ్రంగా మండిపడ్డారు. అమరావతిలో పేదవారికి రైతులకు కేటాయించిన ఆర్ 3 జోన్‌లో ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అమరావతి భూములు ప్రైవేటు వ్యక్తులవి కావు.., ప్రభుత్వానివి అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. న్యాయస్ధానాల తీర్పులను గౌరవిస్తున్నాం కనుకే రాజధానిలో సెంటు భూమిఇస్తున్నాం అంటున్న బోత్సా 2022 మార్చి 3న ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. విశాఖ రుషికొండలోనూ, కర్నూలులో ఉన్న మంచి సెంటర్లలో ఎందుకు పేదలకు సెంటు స్ధలాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.