Capital farmers petition in High Court : అమరావతి రాజధాని ప్రాంతంలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 45ను సవాల్ చేస్తూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ జరిపారు. జీవో నంబర్ 45పై తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేశారు. అటు కౌంటర్ దాఖలు చేయాలని సీఆర్డీఏని హైకోర్టు ఆదేశించింది. 1,134 ఎకరాలను సెంటు పట్టా కింద ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవోను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలో వేరేవారికి ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధం అంటూ అమరావతి రైతులు పిటిషన్ వేశారు. జీవో నం.45పై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది.
అమరావతి విధ్వంసమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. గతంలో ఆర్5 జోన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల కిందట కట్టిన టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు అందించి ప్రజలకు ఇవ్వలేని ప్రభుత్వం.. ఈ ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తుంది అని రాజధాని రైతులు మండిపడ్డారు. ఉద్యోగాలు లేవు.. మౌలిక వసతులు లేవు.. రాష్ట్రానికి వస్తున్న కంపెనీలు పొగొట్టారు... ఇక్కడ వచ్చి ఉండటానికి ఏం ఉందని.. అని ప్రశ్నించారు. విశాఖ రాజధాని అయితే ఇక్కడ గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చి మార్పులు చేయడం ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం.. భూమి ఇచ్చిన రైతులు కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వాములేనని, ఒప్పందం ప్రకారం 25ఏళ్ల వరకూ మాస్టర్ ప్లాన్ మార్చడానికి వీల్లేదని అమరావతి రైతులు గుర్తు చేశారు. ఆ తర్వాత కూడా రైతుల అంగీకారంతోనే సవరణలు చేయాలని అన్నారు.