() మీరుండే ప్రాంతంలో ప్రపంచంలో అత్యధికంగా కొవిడ్-19 బాధితులున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది..?
మార్చి 15 నుంచే అమెరికాలో కేసులు పెరగడం మొదలయ్యాయి. అమెరికాలో న్యూయార్క్ హాట్‌స్పాట్ జాబితాలో మొదటి స్థానంలో, న్యూజెర్సీ రెండో స్థానంలో ఉన్నాయి. మొదటి నాలుగు వారాలు భారీగా పెరిగిన కేసుల సంఖ్య ప్రస్తుతం కాస్త తగ్గింది. ఫలితంగా మాకు వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చన్న భరోసా ఏర్పడింది.
() WHO ముందుగా అప్రమత్తం చేయలేదు. అలాగే చైనా మిగతా దేశాలకు సమాచారాన్ని ముందుగా చేరవేయలేదు. వైరస్ తీవ్రతను అంచనా వేయలేదు అని అమెరికా ఆరోపిస్తుంది. ఇది ఎంత వరకు నిజం..?
చైనా నుంచి అమెరికాకు సమాచారం రావడం కష్టం. ఒక వేళ వచ్చినా అది ఎంత వరకు సరైనదో నమ్మటం కష్టం. ఇలా కాకుండా యూరప్‌లోని ఇటలీ, స్పెయిన్‌ల్లో వైరస్ వ్యాప్తి ఉద్ధృతి గురించి సరిగ్గా అంచనా వేసి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాల్సింది. కానీ ఈ విషయంలో అమెరికా జాగ్రత్త పడలేదు. ఈ విషయంలో అమెరికాదే తప్పు.
() ప్రపంచం ఇప్పటి వరకూ ఎన్నో రకాల వైరస్‌లను ఎదుర్కొంది. కరోనా వర్గానికి చెందిన సార్స్, మెర్స్ వైరస్‌లను ఓడించింది. ఇవేవి కొవిడ్-19 అంత ప్రభావం చూపలేదు. కొవిడ్-19 ఎందుకింత ప్రమాదకరంగా మారింది..?
ఇందుకు చాలా కారణాలున్నాయి. వేగంగా వ్యాప్తి చెందడం, ఊపిరితిత్తులపై ప్రభావం చూపి శరీరానికి ప్రాణ వాయువు అందకుండా చేసి మనిషిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆస్పత్రుల్లో ఈ సంఖ్యలో కరోనా రోగులు అడ్మిట్ అవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు.
() ఏ తరహా వ్యక్తులు అధికంగా వైరస్ ప్రభావానికి గురవుతున్నారు..?
ఇందులో మూడు వర్గాలున్నాయి. 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలుండవు. ఒకవేళ ఉన్నా జలుబు, దగ్గు వంటి సాధారణ ఫ్లూ లక్షణాలుంటాయి. 15 శాతం మంది రోగులకు న్యూమోనియా వస్తుంది. అలాంటి వారికి ఆస్పత్రిలో ప్రాణవాయువు అందిస్తాం. మిగతా 5 శాతం మంది సంక్లిష్ట పరిస్థితిలో ఉంటారు. వీరి ఊపిరితిత్తులను మీగడ వంటి తెల్లటి చిక్కటి ద్రవం ఆవరిస్తుంది. సాధారణంగా ఊపిరితిత్తుల ఎక్స్‌రే చూస్తే మనకు నల్లగా కనిపిస్తుంది. కానీ కరోనా సోకి సందిగ్ధ స్థితిలో ఉన్న రోగి ఎక్స్‌రే చూస్తే అది మనకు తెలుపు రంగులో కనిపిస్తుంది. రక్తం సరఫరా కాకపోవడం, ఆక్సిజన్ అందక వీరు క్రిటికల్ కండీషన్లో ఉంటారు. వీరికి కృత్రిమ ప్రాణాధార వ్యవస్థ(వెంటిలేటర్)పై చికిత్స అందిస్తాం.
() మీరు రోజుకు ఎంతమందికి చికిత్స అందిస్తున్నారు. ఏ తరహా సమస్యలు ఉన్నవారు అధికంగా మీ వద్దకు వస్తున్నారు. వారికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు..?
మా ఆస్పత్రికి వచ్చే రోగులను వారి లక్షణాలను బట్టి వారికి ఎలాంటి చికిత్స అందించాలో నిర్ణయిస్తాం. అనంతరం వారికి ఆక్సిజన్ అందించడం, జ్వరం తగ్గించడానికి మందులు ఇవ్వడం వంటివి చేస్తాం. అంతేకాని వారికి ప్రత్యేకంగా ఎలాంటి చికిత్స అందించం.
() యూ.ఎస్‌లో లక్షల సంఖ్యలో వస్తున్న రోగులకు సరైన వైద్య సౌకర్యాలు ఉన్నాయా..? అందరికీ వైద్యం అందుతోందా..?
అందరికీ సమానంగానే చికిత్స జరుగుతోంది. కానీ కొంతమంది ఆస్పత్రికి రాకపోవడంతో వారు ఇంట్లోనే చనిపోతున్నారు. కరోనా సోకిన వ్యక్తికి రెండు వారాల పాటు వెంటిలేటర్లపై ఉంచాల్సి వస్తోంది. మరోవైపు రోజూ కొత్త కేసులతో వచ్చే వారికి ఇవి అందడం లేదు. అందుకే మా ఆస్పత్రిలో సాధారణ చికిత్సను ఆపి కేవలం కరోనాకు మాత్రమే చికిత్స చేస్తున్నాం.
() ఇంత పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నప్పుడు వెంటిలేటర్లు ఎలా సరిపోతాయి..? అసలు వెంటిలేటర్లను ఏ సందర్భంలో ఉపయోగించాలి..?
పరిస్థితి విషమంగా ఉన్నవారికే వెంటిలేటర్లను వినియోగిస్తున్నాం. కరోనా సోకిన వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల సైటోకైన్ స్టార్మ్ అనే ప్రొటీన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా రోగికి ఆక్సిజన్ అందకపోవడం, రక్తం సరఫరా కాకపోవడం, మూత్రపిండాలు, కాలేయం చెడిపోవడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఈ సైటోకైన్ స్టార్మ్ పెరుగుదలను తగ్గిస్తే మరణాల రేటును కొంత వరకు తగ్గించవచ్చు.