Electricity Charges Burden on Industries in Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వం వడ్డిస్తున్న విద్యుత్ భారాన్ని మోయలేక రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ కుదేలవుతున్నాయి. పరిశ్రమలపై ఛార్జీల భారం వేయబోమంటూనే వివిధ రకాల ఛార్జీల పేరుతో యూనిట్‌కు 2.19 పెంపుతో.. ఒక మోస్తరు పరిశ్రమలపై నెలకు 4.18 లక్షల భారం మోపుతోందని గగ్గోలు పెడుతున్నాయి. చిన్న పరిశ్రమలనూ వదలకుండా బాదేస్తున్నారని మండిపడుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే 20 శాతం పరిశ్రమలు మూతపడ్డాయని.. పరిస్థితి ఇలానే కొనసాగితే మిగిలి ఉన్న వాటి నిర్వహణ సైతం కష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పారిశ్రామిక వర్గాలు.
విద్యుత్ సుంకం, ట్రూ అప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు.. ఇలా నాలుగేళ్లలో పరిశ్రమలపై ప్రభుత్వం వేసిన అదనపు ఛార్జీల భారాలకు ప్రభుత్వం పెట్టిన పేర్లు ఇవి. ఏ చిన్న కష్టం వచ్చిన సరే పరిశ్రమలకు ఫోన్‌కాల్ దూరంలోనే తమ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చిన సీఎం జగన్.. పారిశ్రామిక సంఘాలు విద్యుత్ సుంకాన్ని తగ్గించండి మహాప్రభో అని మొర పెట్టుకున్న ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.
ఛార్జీల భారాన్ని తగ్గించకపోతే పరిశ్రమలు మూతపడటం మినహా మరో గత్యంతరం లేదని పారిశ్రామికవేత్తలు గోడు వెళ్లబోసుకున్నా ‘చెవిటివాడి ముందు శంఖం ఊదిన’ సామెత లాగా పరిస్థితి తయారైంది. విద్యుత్ కోతల కారణంగా పరిశ్రమలు గత రెండేళ్లుగా ఉత్పత్తి నష్టాలను చవిచూశాయి. రాష్ట్రంలో కరోనా ప్రభావం, విద్యుత్ వడ్డన భారంతో.. 20 శాతం పరిశ్రమలు మూతపడ్డాయని పారిశ్రామిక సంఘాలు చెబుతున్నాయి.
Tax Increase: వరుస పన్నుల బాదుడుతో బెంబేలెత్తుతున్న విజయవాడ వాసులు
Heavy Power Charges on Industries in AP: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలకు నేరుగా ఛార్జీలను పెంచకున్నా వివిధ రూపాల్లో ఛార్జీల మోత మోగించింది. ఒక మోస్తరు పరిశ్రమపై ప్రతి నెలా 4.18 లక్షల భారం పడింది. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులకు యూనిట్‌కు 6 పైసలుగా ఉన్న విద్యుత్ సుంకాన్ని 2022 మే నుంచి యూనిట్‌కు ఏకంగా రూపాయికి పెంచింది. వాటిని భరించే స్థితిలో పరిశ్రమలు లేవని, సుంకాన్ని తగ్గించాలని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేదు.
2022 ఆగస్టు నుంచి ట్రూఅప్ పేరుతో యూనిట్‌కు 22 పైసలు, 2021-22లో వినియోగించిన విద్యుత్‌కు ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద 2023 ఏప్రిల్ నుంచి యూనిట్‌కు 63 పైసల అదనపు భారం వేసింది. 2023-24లో ఎఫ్‌పీపీసీఏ కింద యూనిట్‌కు 1.10 వంతున వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదించాయి. అందులో యూనిట్‌కు 40 పైసల చొప్పున గత ఏప్రిల్ నుంచి వసూలు చేస్తున్నాయి. మిగిలిన 70 పైసలు ఏడాది చివర్లో ట్రూఅప్ కింద వసూలు చేసే అవకాశం ఉంది. ఇలా జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో పరిశ్రమలపై యూనిట్‌కు 2.89 భారాన్ని వేసింది.
పన్ను తగ్గించండి..రాష్ట్ర వ్యాప్తంగా లారీ అసోసియేషన్ యజమానుల ధర్నా
Heavy Power Charges on Industries in AP: ట్రూఅప్, ఎఫ్‌పీపీసీఏల పేర్లతో ప్రభుత్వం వేసిన విద్యుత్ ఛార్జీల భారాలతో పరిశ్రమల ఉత్పత్తి వ్యయంపై సుమారు 26 శాతం ప్రభావం పడింది. సాధారణంగా ఇంజినీరింగ్, తయారీ వంటి కొన్ని రకాల పరిశ్రమల్లో విద్యుత్ ఖర్చు 20 శాతం ఉంటుంది. ఫర్నేస్ ఆధారంగా మెల్టింగ్ చేసే ఫౌండ్రీలు, స్పిన్నింగ్ మిల్లులు వంటి వాటిలో 40శాతం ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమల్లో 60 శాతం వరకు విద్యుత్తే ముడిసరకు. ప్రభుత్వం వేసిన అదనపు భారాలతో ఈ తరహా పరిశ్రమలన్నీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి.
ఇప్పటికే ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు మూతపడ్డాయి. సాధారణంగా పరిశ్రమలు ఇప్పుడున్న విద్యుత్ టారిఫ్ ప్రకారమే కొటేషన్ ఇస్తాయి. ఆర్డర్ తీసుకున్నప్పటి నుంచి పని పూర్తి చేయడానికి 3, 4 నెలలు పడుతుంది. ఈలోపు అదనపు భారాలు పడ్డాయంటే లాభానికి బదులు నష్టపోవాల్సి వస్తోంది.
గతంలో వినియోగించిన విద్యుత్‌కు ప్రస్తుతం అదనపు ఛార్జీలు విధించటంతో పరిశ్రమలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఎప్పుడో వాడిన విద్యుత్‌కు ఇప్పుడు బిల్లులు వసూలు చేయడానికి బదులు.. విద్యుత్ టారిఫ్ రెండు సంవత్సారలకు ఓ సారి సమీక్షించి సవరించిన కూడా పరవాలేదని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఆ రకంగా మరో రెండు సంవత్సరాలపాటు ఛార్జీల పెంపు ఉండదని ప్రభుత్వం హామీ ఇస్తే ఆ వ్యవధిలో వస్తు తయారీ ధరను నిర్ణయించి సరఫరా చేయడానికి వెసులుబాటు ఉంటుందని చెబుతున్నాయి.