పుర, నగరపాలక సంస్థలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విద్యుత్‌ఛార్జీల బకాయిల కింద ఆర్థిక సంఘం నిధులు రూ.294.43 కోట్లను మళ్లిస్తూ ఉత్తర్వులిచ్చింది. పుర, నగరపాలక సంస్థల విద్యుత్ బకాయిలను డిస్కంల ఖాతాలకు బదిలీ ప్రక్రియను సోమవారం నుంచి ఆర్థిక శాఖ ప్రారంభించింది. దీంతో ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పారిశుద్ధ్యం, కాలువలు, రహదారుల నిర్వహణ పనులు ప్రశ్నార్థకమయ్యే అవకాశముంది.
పంచాయతీలనుంచి రెండు విడతలుగా రూ.1,350 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ ఛార్జీలకు మళ్లించడంపై సర్పంచులనుంచి లోగడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా మున్సిపాలిటీలకూ ఈ పరిస్థితి తప్పలేదు. స్థానిక సంస్థల విద్యుత్ ఛార్జీల బకాయిలను 14, 15వ ఆర్థిక సంఘం నిధులనుంచి నేరుగా సర్దుబాటు చేసేలా ఆర్థిక శాఖ ఫిబ్రవరి 23న ఉత్తర్వులిచ్చింది. దీని ప్రకారం 2022 జనవరి వరకు పట్టణ స్థానిక సంస్థలున్న బకాయిల వివరాలను డిస్కంలు అందించాయి.