సంగం డెయిరీ నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారంటూ.. సంస్థ ఛైర్మన్, తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. డెయిరీని సహకార చట్టం నుంచి మ్యాక్స్ చట్టం పరిధిలోకి తెచ్చే క్రమంలో.. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారని నరేంద్రపై అభియోగాలు మోపారు. ఉదయం 7 గంటలకు నరేంద్రను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది. తెల్లవారుజామున 5 గంటలకే పొన్నూరు మండలం చింతలపూడిలోని నరేంద్ర నివాసానికి అనిశా అధికారులు.. భారీగా బలగాలను వెంటబెట్టుకుని వచ్చారు. ధూళిపాళ్ల నివాసంలో తనిఖీలు చేసిన అధికారులు.. అనంతరం నరేంద్రను అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఈ క్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకోగా.. ఉద్రిక్తత నెలకొంది.
ధూళిపాళ్లపై 408, 409, 418, 420, 465, 471, 120-B సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలో సహకార శాఖ రిజిస్ట్రార్‌గా పనిచేసిన గుర్నాథంను కూడా ఈ కేసులో అనిశా అధికారులు ఒంగోలులో అరెస్ట్ చేశారు. ఇద్దరిపైనా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అనిశా అధికారులు తెలిపారు. నరేంద్ర అరెస్టులో అనిశా అత్యంత గోప్యత పాటించింది. బాపట్ల నుంచి 200 మందికిపైగా పోలీసుల్ని పిలిపించి చింతలపూడిలోని నరేంద్ర నివాసంతో పాటు.. వడ్లమూడిలోని సంగం డెయిరీ, పొన్నూరులోని ఇంటి వద్ద బలగాల్ని మోహరించారు. నరేంద్ర అరెస్ట్ తర్వాత సంగం డెయిరీలోనూ తనిఖీలు చేశారు. సంస్థ ప్రధాన కార్యాలయంలోని దస్త్రాలను పరిశీలించిన అధికారులు.. అవసరమైనవాటిని స్వాధీనం చేసుకున్నారు. సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌ను కూడా అనిశా అధికారులు అరెస్ట్ చేశారు.