Devadaya lands are occupied by YCP leaders: గుంటూరు జిల్లా పొన్నూరులో భావన్నారాయణ స్వామి ఆలయానికి సర్వే నంబర్ 213/1Aలో 19.98 ఎకరాల భూమి ఉంది. మొత్తం 14మంది రైతులకు ఈ భూమిని అధికారులు కౌలుకు ఇచ్చారు. 2025 వరకు భూములపై లీజు హక్కులు రైతులకున్నాయి. వరి పంటతో పాటు రబీలో జొన్న, మొక్కజొన్న, వేసవిలో కూరగాయలు సాగుచేస్తుంటారు.
ఈ భూముల్లో రహదారి వెంట ఉన్న 9.04 ఎకరాల భూములను 11 ఏళ్లు లీజుకు ఇవ్వటానికి.. ధార్మిక పరిషత్ అనుమతి ఇచ్చింది. అయితే ఆలయ భూములు వ్యవసాయేతర అవసరాలకు లీజుకివ్వడాన్ని ధర్మకర్త వ్యతిరేకించారు. అలాగే రైతుల్లో కొందరు.. తమకు 2025 వరకు లీజు గడువు ముగిసే వరకు తామే సాగుచేసుకుంటామని చెప్పారు. జీవనోపాధి కల్పిస్తున్న భూములను సాగేతర అవసరాలకు ఎలా లీజుకు ఇస్తారని ప్రశ్నించారు. కానీ మెజారిటీ రైతులు లీజుకు ఇవ్వడానికి అభ్యంతరం లేదని రాసిచ్చారు.
11ఏళ్ల లీజుకు భూములు..ఈ మేరకు దేవాదాయ అధికారులు పంపిన నివేదిక ఆధారంగా ధార్మిక పరిషత్ లీజుకు ఆమోదం తెలిపింది. దీంతో బహిరంగవేలం వేసి 11ఏళ్ల లీజుకు భూములు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. పొన్నూరు పట్టణానికి సమీపంలో గుంటూరు- బాపట్ల రహదారి పక్కనే ఈ భూములు ఉండటంతో కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి. విలువైన భూములను వేలంలో దక్కించుకోవడానికి ఇక్కడి ప్రజాప్రతినిధి పావులుకదుపుతున్నారు. అధికారమే అండగా ఒక్కో ప్రక్రియ పూర్తిచేసుకుంటూ లీజు కోసం బహిరంగవేలానికి అనుమతులు సాధించారు. అక్కడ కూడా తన అనుచరుల పేరుతో భూములు దక్కించుకుని నిర్మాణాలు చేయాలన్న యోచనలో ఉన్నారు.