గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తంగా మారింది. అక్రమ నిర్మాణాల పేరిట కొన్ని నివాసాలను అధికారులు ప్రొక్లెయిన్లతో కూల్చేశారు. బాధితులు అడ్డుకుంటున్నా.. పోలీసుల సాయంతో నిలువరించి మరీ పడగొట్టేశారు. కేసు న్యాయస్థానంలో ఉండగానే కూల్చివేతలకు ఒడిగట్టారని బాధితులు వాపోయారు. 40 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఉంటున్న తమకు స్థలాలు కేటాయించకుండా ఎలా తొలగిస్తారని ఇళ్లు ఎలా తొలగిస్తారని ఆందోళనకు దిగారు. బాధితులకు తెలుగుదేశం, వామపక్షాల నేతలు మద్దతుగా నిలిచారు. ప్రత్యామ్నాయ స్థలాలు చూపిన తర్వాతే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదు
ఇళ్లు ఖాళీ చేయాలని వచ్చిన నోటీసుల గురించి చెప్పుకునేందుకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వద్దకు వెళితే, తమను కనీసం కార్యాలయం లోనికి రానివ్వలేదని కొందరు బాధితులు ఆరోపించారు. ‘మీ గ్రామంలో నాకు ఓట్లు వేయలేదు. మీరు ఏ సమస్యతోనూ నా దగ్గరకు రావొద్దు’ అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారంటూ ఆయన కార్యాలయ సిబ్బంది తమతో అన్నారని బాధితులు వాపోయారు.