Slogans from Dharanikota to Errakota: గత ప్రభుత్వం అమరావతి రాజధానిగా ప్రకటించడంతో..ఆ ప్రాంత ప్రజలు, రైతులు ఎంతో సంబరపడిపోయారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేల ఎకరాలను రాజధాని రైతులు.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు ఆగిపోయాయి. కొద్ది నెలల్లోనే సీఎం జగన్.. 3 రాజధానులు ప్రకటన చేయడంతో అమరావతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నో కలలు గన్న రాజధాని రైతులు.. నిద్రలేని రాత్రులు గడుపుతూ నేటికీ ఉద్యమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.
మూడు రాజధానులు ప్రకటించి.. నేటికి మూడేళ్లు పూర్తవడంతో.. దిల్లీ గడ్డపై గట్టిగా చాటేందుకు సిద్ధమయ్యారు. పార్టీలు వేరు, అభిప్రాయాలు వేరు, సిద్ధాంతాలు వేరు.. అయినా అంతా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలనే ఏకాభిప్రాయం కోసం ఒక్కటయ్యారు. ప్రజల ఆకాంక్షే పార్టీల అజెండా అంటూ ఏకతాటిపైకి వచ్చారు. పాదయాత్రలు, నిరాహారదీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, అసెంబ్లీ ముట్టడి, మౌన ప్రదర్శనలు, ప్రార్థనలు, యాగాలు.. ఇలా ఎన్ని రకాల్లో నిరసన తెలపాలో అన్ని రకాల్లోనూ తమ గళాన్ని వినిపించారు. పోలీసు నిర్బంధాల్ని ఎదుర్కొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైళ్లకు వెళ్లారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికీ వెరవకుండా వివిధ రూపాల్లో పోరాటాన్ని కొనసాగించారు.
అమరావతి పరిరక్షణ కోసం రైతులు ఇప్పుడు దేశ రాజధాని దిల్లీ వరకు తమ ఉద్యమ నినాదాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన చేసినందున కేంద్రానికి బాధ్యత ఉందని గుర్తుచేయనున్నారు. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంతర్‌మంతర్ వద్ద రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు బృందాలుగా విడిపోయి.. వివిధ పార్టీల అధ్యక్షులు, ఎంపీలను కలసి తమకు జరుగుతున్న అన్యాయం గురించి వివరిస్తారు. 19న రామ్‌లీలా మైదానంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి ప్రత్యేక రైలులో దిల్లీ నుంచి బయలుదేరి 21వ తేదీ ఉదయానికి విజయవాడ చేరుకుంటారు.