ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 20, 2020, 10:59 PM IST

ETV Bharat / state

కరకట్టకు గండ్లు.. ఆందోళనలో ప్రజలు

కృష్ణానదికి వరద వస్తోందంటే తీరప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ముఖ్యంగా గుంటూరు జిల్లా భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో కరకట్ట వెంట ఉండే గ్రామాల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంటోంది. 2009లో భారీ వరదల కారణంగా కరకట్టకు గండి పడి అపార నష్టం జరిగింది. కరకట్ట అభివృద్ధి కోసం చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నందున ఎక్కడ ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

crest-strength-incomplete-in-guntur-district
కరకట్టకు గండ్లు.. ఆందోళనలో ప్రజలు

కృష్ణానది వరదల నుంచి పంటపొలాల్ని, జనావాసాల్ని రక్షించడంలో కరకట్ట అడ్డుగోడలా నిలబడుతుంది. భారీ వరదలు వచ్చిన సమయంలో నదీతీరం వెంట ఉండే గ్రామాల్లోకి వరద రాకుండా కాపాడుతుంది. అయితే కరకట్ట బలహీనంగా ఉన్న చోట తరచుగా గండ్లు పడి వరదనీరు గ్రామాల్ని ముంచెత్తిన ఘటనలు ఉన్నాయి.

గ్రామాలు జలదిగ్బంధం

కృష్ణా నదికి 2009లో వరద వచ్చిన సమయంలో భట్టిప్రోలు మండలం ఓలేరు పల్లెపాలెం వద్ద కరకట్టకు గండి పడింది. దీంతో రేపల్లె పట్టణంతో పాటు 18 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది గృహాలు నేలమట్టమయ్యాయి. పొలాలైతే చాలా రోజుల తర్వాత గాని ముంపు నుంచి బయటపడలేదు. అప్పట్లో గండి పడటానికి కరకట్ట బలహీనంగా ఉండటమే కారణమని నిపుణులు తేల్చారు. దీంతో అప్పటి ప్రభుత్వం కరకట్టలు బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. 113 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా... 7 మీటర్ల వెడల్పుతో బీటీ రోడ్డు వేయటం, కట్టకు అటూ ఇటూ రక్షణ చర్యలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు.

ఆగిపోయిన పనులు

గుంటూరు జిల్లాలో సీతానగరం నుంచి పెనుమూడి వరకు 64 కిలోమీటర్ల మేర కరకట్టను బలోపేతం చేయాల్సి ఉండగా... 56 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. వేర్వేరు కారణాలతో 8 కిలోమీటర్ల మేర పనులు ఆగిపోయాయి. విజయవాడ క్లబ్ వద్ద 700 మీటర్లు, పెదకొండూరు వద్ద 800 మీటర్లు, కొల్లూరు వద్ద కిలోమీటర్, దోనెపూడి వద్ద 1.5 కిమీ, పెదపులివర్రు వద్ద 2 కిమీ, వెల్లటూరు వద్ద 2 కిమీ పనులు జరగలేదు. దీంతో పదేళ్లు గడిచినా నేటికీ కరకట్ట బలోపేతం పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇటీవల కృష్ణానదికి 2 సార్లు వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజి నుంచి 7లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మళ్లీ 2009 నాటి పరిస్థితి వస్తుందని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందారు. అదృష్టవశాత్తూ కరకట్ట లోపలి వైపు మాత్రమే నష్టం జరిగింది. కరకట్టను పటిష్ఠం చేయకపోతే ఎప్పటికైనా ప్రమాదమేనని.... ఆ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే

భట్టిప్రోలు మండలంలోనూ పల్లెపాలెం దగ్గర గతంలో పడిన ప్రదేశంలోనే కరకట్ట అంచులు పాక్షికంగా కుంగుతోంది. పెదకొండూరు-వల్లభాపురం మధ్యలో ఆధునీకరణ పనులు జరిగినా.. ఇక్కడ కరకట్ట కొంచెం బలహీనంగా ఉంది. వర్షాలు, వరదల సమయంలో మట్టి జారిపోతుంది. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా అవి గండ్లుగా మారే ప్రమాదం ఉంది. రావి అనంతవరం - పెనుమూడి మధ్యలో ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక పెనుమూడి నుంచి లంకవానిదిబ్బ వరకు 34కి.మీ మేర పనులు చేశారు. 45కోట్ల రూపాయలు వెచ్చించారు. అయితే మట్టికట్టపైన తారురోడ్డు వేయనందున ఎక్కడికక్కడ పగుళ్లు వస్తోంది. వరదల సమయంలో గండ్లకు ఆస్కారం ఉంది. అధికారులైతే పెండింగ్ పనులు నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. కరకట్ట మార్గాన్ని తీరప్రాంత ప్రజలు రహదారిగా ఉపయోగిస్తుంటారు. పనులు అక్కడక్కడా ఆగిపోయిన కారణంగా రవాణాపరంగానూ ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

కృష్ణమ్మకు వరద వస్తుందంటే చాలు నీటిపారుదల శాఖ అధికారులు కరకట్ట వెంట పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎక్కడ బలహీనంగా ఉందో చూసి అక్కడ ఇసుక బస్తాలు వేసి మరమ్మతులు చేస్తుంటారు. కరకట్ట బలోపేతం జరగని ప్రాంతాల్లో పనులు చేపట్టి.. గండ్లకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ఆధునీకరణ పనులు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఇవీ చదవండి..

వావ్​ నేవీ: కళ్లు చెదిరేలా మ‌ల‌బార్ 2020 రెండో దశ విన్యాసాలు

ABOUT THE AUTHOR

...view details