Consumer commission fines Zomato : పనీర్ బర్గర్ ఆర్డర్ ఇస్తే చికెన్ బర్గర్‌ను ఇంటికి పంపి మతపరమైన మనోభావాలు దెబ్బతీశారంటూ నమోదైన కేసులో జొమాటోను వినియోగదారుల కమిషన్-3 తప్పుపట్టింది. ఫిర్యాదీకి రూ.5 వేలు, కేసు ఖర్చులు రూ.1,000తోపాటు రూ.202.50 రిఫండ్ చేయాలని ఆదేశించింది. తెలంగాణలోని అంబర్‌పేట్‌కు చెందిన దీపక్‌కుమార్ సంగ్వాన్ జొమాటోలో కొత్తపేటలోని కార్నర్ బేకర్స్‌లో పనీర్ బర్గర్, కోక్ ఆర్డర్ ఇచ్చారు. డెలివరీ బాయ్ చికెన్ బర్గర్ తీసుకురావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతివాద సంస్థ రూ.500 చెల్లిస్తామని తెలిపింది. సంతృప్తి చెందని ఫిర్యాదీ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
- బీమా క్లెయిమ్ చెల్లించకుండా ఇబ్బంది పెట్టిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌పై హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 అభ్యంతరం వ్యక్తం చేసింది. మృతి చెందిన తన భర్త ప్రతివాద సంస్థలో పాలసీదారుడని పరిహారం ఇప్పించాలంటూ రాజేంద్రనగర్‌కు చెందిన శిల్ప బన్సల్ కమిషన్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదీకి రూ.54 లక్షలు, 9 శాతం వడ్డీతో, రూ.20 వేలు పరిహారం 45 రోజుల్లో చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
- ఐటీ సేవల్లో లోపాలకు గాను 3డైమెన్షన్స్ ఐటీ సర్వీసెస్ ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్ట్స్‌కు రూ.2,07,000, 12 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని, రూ.25 వేలు పరిహారం, రూ.10 వేలు కేసు ఖర్చులు ఇవ్వాలని ఆదేశించింది.
- నిబంధనలకు విరుద్ధంగా 10 శాతం సర్వీస్ ఛార్జీ వసూలు చేసిన బ్రాడ్‌వే ది బ్రెవెరీ రెస్టారెంట్ కొత్తపేటకు చెందిన కె.వెంకటేశ్‌కు రూ.10వేల పరిహారం, కేసు ఖర్చులు రూ.5 వేలు చెల్లించడంతోపాటు రూ.521 రిఫండ్ చేయాలని కమిషన్ ఆదేశించింది.
- తప్పుడు ఫలితాలు ఇచ్చి ఫిర్యాదీ మానసిక వేదనకు కారణమైన పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీలోని విజయ డయాగ్నస్టిక్ సెంటర్ లిమిటెడ్‌కు వినియోగదారుల కమిషన్-1 జరిమానా విధించింది. ముషీరాబాద్‌కు చెందిన పి.నాగార్జునరెడ్డికి రూ.60 వేలు చెల్లించాలని ప్రతివాద సంస్థకు స్పష్టం చేసింది.