CM SPOKE WITH MINISTERS : బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో అధికారులు వెళ్లిపోయాక చివర్లో మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు వివిధ అంశాలను సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైతులకు పంట అంటేనే వరి అని.. అక్కడ ప్రభుత్వం పూర్తిగా ధాన్యం సేకరించకుంటే వారికి చాలా కష్టమని ఉత్తరాంధ్రకు చెందిన ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.
'ఈసారి ధాన్యానికి మంచి ధర ఇచ్చి కొన్నాం.. రైతులకు మంచి జరిగింది’ అని ముఖ్యమంత్రి అనగా.. ప్రస్తుతం కొనడం ఆపేశారని మంత్రులు అన్నట్లు తెలిసింది. లక్ష్యాలు పూర్తయ్యాయని సేకరించడం లేదని.. రైతులు ఈ విషయమై ఆందోళనగా ఉన్నారని సీఎంకు వివరించినట్లు సమాచారం. ఇంతకాలం కొని చివర్లో కొనకుండా రైతులను ఇబ్బంది పెట్టడమేంటన్న సీఎం.. లక్ష్యాలని పెట్టుకోకుండా ఈ నెలాఖరు వరకు మొత్తం ధాన్యం కొనేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
‘ధాన్యం సేకరణలో ఇప్పుడు అమలు చేస్తున్న విధానం బాగుందని సీఎం అన్నారని... దీనిపై మంచి ఫీడ్‌బ్యాక్ ఉంది’ అని చెప్పినట్లు తెలిసింది. ధాన్యాన్ని తీసుకువెళ్లినప్పుడు మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారని రైతులు చెబుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా చెప్పినట్లు సమాచారం. మధ్యలో మిల్లర్లు ఎందుకొచ్చారన్న సీఎం.. రైతు భరోసా కేంద్రంలోనే ధాన్యం నాణ్యతను నిర్ధారించి.. రైతులకు ఎఫ్‌టీఓ జారీ చేస్తున్నారని చెప్పినట్లు తెలిసింది. రైతులకు ఎక్కడైనా మిల్లర్ల నుంచి ఇబ్బంది ఉంటే అక్కడి నుంచే తనకు లేదా అధికారులకు ఫోన్ చేయాలని సీఎం చెప్పినట్లు సమాచారం.
ఆ ముగ్గురిలాగే మిగిలిన వాళ్లూ బాగా చేయాలి:ప్రతిపక్షాల విమర్శలను మంత్రులు తిప్పికొట్టే అంశం చర్చకొచ్చినప్పుడు మంత్రి బొత్స, మరో ఇద్దరు, ముగ్గురు మంత్రులు ముందున్నారని.. బాగా స్పందిస్తున్నారని కొందరు సరదాగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ‘ఆ విషయంలో బొత్స ముందున్నారన్న సీఎం.. కారుమూరి నాగేశ్వరరావు, రజిని కూడా ప్రభుత్వం చేస్తున్న మంచిని చెబుతూ, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో బాగా పనిచేస్తున్నారు' అని సీఎం అన్నట్లు సమాచారం. వారిలాగే మిగిలిన మంత్రులూ చేయాలి అని సూచించినట్లు తెలిసింది.