CM Jagan Promises to Prathipadu People: అమలుకు నోచుకోని ఆర్భాటపు ప్రకటనలు.. నిధులిచ్చేస్తున్నాం.. పనులు మొదలుపెట్టేస్తున్నాం.. అంటూ ఉత్తుత్తి హామీలు.. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఏ బహిరంగ సభకు వెళ్లినా జరిగే తంతు. ఇదే విధంగా ఏడాదిన్నర క్రితం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పర్యటించిన సీఎం జగన్.. అడిగిందే తడవుగా వరాల జల్లు కురిపించారు. వాటిల్లో ఏ ఒక్కపనీ ఇప్పటికీ మొదలుపెట్టలేదు. సీఎం జగన్ మరోసారి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న వేళ ఆయన హామీల అమలు తీరుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం..
ముఖ్యమంత్రి జగన్ హామీల వర్షంతో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ప్రజలు పులకించిపోయారు. రెండేళ్లలో ప్రత్తిపాడు స్వరూపమే పూర్తిగా మార్చేస్తానంటూ బీరాలు పలికారు. ఇప్పుడే నిధులు విడుదల చేస్తున్నాం.. ఇక పనులు పరిగెత్తిస్తామంటూ ఊదరగొట్టారు. ఇది ఒక్క ప్రత్తిపాడుకే పరిమితం కాదు.. ముఖ్యమంత్రి జగన్ సభ ఎక్కడ నిర్వహించినా.. చివరిలో ఆయా నియోజకవర్గంపై హామీల వర్షం కురిపించడం ఆనవాయితీ. ఆ తర్వాత వైసీపీ నేతలు చేసే హడావుడి మాములుగా ఉండదు. అన్న చెప్పాడంటే చేస్తాడంటూ మోతెక్కిస్తారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం.. సీఎం సభలో ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలైన దాఖలాలు కనిపించవు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడునే తీసుకుంటే.. నిండు సభ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు. తాగునీటి సమస్య తీర్చేందుకు గుంటూరు ఛానెల్‌ను పొడిగిస్తామని.. 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామని.. సీఎం జగన్ చెప్పారు. ఇప్పటికి ఏడాదిన్నర పూర్తయినా.. పనులే మొదలుపెట్టలేదు. భూసేకరణకు నిధులివ్వకపోవడంతో ఈ హామీ అటకెక్కింది. సీఎం హోదాలోనే కాదు.. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలోనూ గుంటూరు కాల్వను పర్చూరు వరకు పొడిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
ప్రత్తిపాడులో తాగునీటి పథక కోసం 13 కోట్లు, ప్రధాన రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనుల కోసం 7 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం చెప్పినా.. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. తాగునీటి పథకానికి జలజీవన్ మిషన్ కింద కేంద్రం 11.60కోట్లు మంజూరు చేసినా ఆ పనులనూ మొదలుపెట్టలేదు. పెదనందిపాడులో క్రీడా వికాస కేంద్రం నిర్మాణానికి 2కోట్లు, సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం కోసం 7కోట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి 2.8కోట్లు ఇస్తామంటూ బహిరంగ సభలో ప్రజలకు గొప్పలు చెప్పిన సీఎం జగన్.. ఏడాదిన్నర పూర్తయినా ఇప్పటికీ ఒక్క పైసా విదల్చలేదు.
ముఖ్యమంత్రి జగన్ హామీ ఇవ్వడంతో తమ ఊరు రూపురేఖలు మారిపోతాయని సంతోషించామని.. కానీ అవన్నీ ఉత్తిత్తి హామీలేనని తెలుసుకోలేకపోయామని స్థానికులు మండిపడుతున్నారు. వేలాది మంది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే ఎలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రచారం కోసమే ప్రకటనలు తప్ప.. నిధులిచ్చేవి కావని ఎద్దేవా చేస్తున్నారు.
గుంటూరులో వైఎస్సార్ యంత్ర సేవా పథకం: ముఖ్యమంత్రి జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. YSR యంత్ర సేవా పథకం రెండో విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు అందించనున్నారు. 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు,13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేయనున్నారు. వీటి విలువ 361 కోట్లు కాగా...125.48 కోట్ల రాయితీని రైతు సంఘాల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు మంజూరు చేసిన వాహనాలు, యంత్రపరికరాల్ని గుంటూరు మిర్చియార్డులో ఉంచారు. వాటిని ముఖ్యమంత్రి ఇవాళ జెండా ఊపి ప్రారంభిస్తారు. మిగతా జిల్లాలకు చెందిన వాహనాలు ఎక్కడికక్కడ మంత్రుల చేతుల మీదుగా పంపిణి చేయనున్నారు. ఇప్పటికే రైతులు వాహనాలు కొనుగోలు చేసి వినియోగిస్తుండగా....సీఎం కార్యక్రమం కోసం రావాల్సిందేనంటూ అధికారులు ఆదేశించడంతో వందల కిలోమీటర్ల నుంచి రెండురోజులు ముందే వచ్చామంటూ రైతులు వాపోయారు. సీఎం పర్యటన దృష్ట్యా గుంటూరు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
"హామీలైతే ఇచ్చారు.. మరి అమలెప్పుడు సారూ.."