భార్యాభర్తల మధ్య గొడవలను ఆసరాగా చేసుకుని.. వారిని పూజల పేరుతో మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులో నివాసం ఉండే విజయ, రమేశ్ దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రమేశ్ మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. గత కొన్నాళ్లుగా బాధితురాలు విజయకి, ఆమె భర్త రమేశ్‌కు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పూజలు చేస్తే గొడవలు పోతాయని ప్రశాంతంగా ఉంటారంటూ.. బాధితురాలి కుమార్తె స్నేహితులు సూచించారు.
భర్త చనిపోతాడంటూ ..
పలువురు మాటలు విని.. వాటిని నమ్మిన బాధితురాలు, ఆమె కుమార్తె.. నిందితుడు చిన్ని శ్రీధర్‌ను కలిశారు. తన భర్తతో తనకు తరచూ గొడవలు జరుగుతున్నాయని.. జీవితంలో ప్రశాంతత లేకుండాపోయిందని అతడికి వివరించారు. పూజలు చేస్తే అన్నీ సర్ధుకుంటాయని..శ్రీధర్ వారిని నమ్మించాడు. అందుకు కొంత ఖర్చు అవుతుందంటూ విడతలవారిగా.. రూ. 9.60 లక్షలు డబ్బు తీసుకున్నాడు. వారి అమాయకత్వాన్ని పసిగట్టిన నిందితుడు మరికొన్ని పూజలు గుడిలో చేయాలని.. దానికి మరికొంత ఖర్చవుతుందని చెప్పాడు. తమ వద్ద డబ్బులు లేవని చెప్పగా.. మధ్యలో పూజలు ఆపేస్తే భర్త చనిపోతాడని భయపెట్టాడు.
చంపేస్తానని బెదిరించి..
అతడి మాటలకు బాధితురాలు స్పందించకపోవడం.. పూజకు నగదు ఇవ్వకపోవడంతో ఆమెను చంపేస్తానని బెదిరించాడు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, స్థలం పేపర్లు తీసుకున్నాడు. ఇంటిలో నగలు, డబ్బులు మాయంపై భర్త ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు చెబితే చంపేస్తానని నిందితుడు భయపెట్టినట్లు భాదితురాలు అరండల్‌పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి గుంటూరు అమరావతి రోడ్డులో నిందితుడు చిన్ని శ్రీధర్‌ను అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 6 లక్షల నగదు, లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడని బాధితురాలు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసగించినట్లు విచారణలో తేలింది.
ఇదీ చదవండి:
మేడికొండూరు సామూహిక అత్యాచారం కేసులో దర్యాప్తు వేగవంతం