Chandrababu Naidu Comments in TDP Jayaho BC Meeting:తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్లో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. బీసీలు బలహీనులు కాదు, బలవంతులనే నినాదంతో సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి బీసీ నేతలు భారీగా తరలి వచ్చారు. ఎన్టీఆర్, జ్యోతిరావుపూలే విగ్రహాలకు నివాళులర్పించారు. అదే విధంగా బీసీలపై రూపొందిన ప్రత్యేక గీతాన్ని చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
బీసీలకు సంక్షేమంతోపాటు అనేక పదవులను ఇచ్చి మెరుగైన భాగస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ అందించిందని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ వేసిన బలమైన బీసీ పునాదులను బలోపేతం చేస్తూ, మరింత మంది బీసీ నాయకులు రాజకీయాల్లో ఎదిగేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
తెలుగుదేశం పార్టీ లక్షల మందిని నాయకులుగా తయారు చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. అవకాశం ఇచ్చినప్పుడే తన ప్రతిభను చూపిస్తారన్న చంద్రబాబు, అవకాశం రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని తెలిపారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాగానే 34 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని మండిపడ్డారు.
రాష్ట్రానికి జగన్ అక్కర్లేదని సర్వేలు చెబుతున్నాయి: చంద్రబాబు
బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా: వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు అని కొనియాడారు. బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి కృషి చేశామని, ఆదాయం పెంచే మార్గాలను తాను సూచించినట్లు పేర్కొన్నారు. ఆదరణ కార్యక్రమంలో బీసీలను ఆదుకున్నామని, 90 శాతం సబ్సిడీతో ఆధునిక పనిముట్లు అందించినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. నాలుగేళ్లలో బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. కార్పొరేషన్లు పెట్టినా అందులో నిధులు లేకపోతే ఏం లాభమని నిలదీశారు.
బీసీలను ఆర్థికంగా అణగదొక్కారు: వైసీపీ హయాంలో 3వందల మంది బీసీలను పొట్టనబెట్టుకున్నారన్న బాబు, అనేక వందలమందిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారని ఆవేదన వ్యక్తంచేశారు.గతంలో తెలుగుదేశం ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, 30కి పైగా పథకాలను రద్దుచేసి బీసీలను ఆర్థికంగా ఎదగకుండా అణగదొక్కారని విమర్శించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను సైతం తగ్గించి వేలమంది బీసీలకు రాజకీయ అవకాశాలు లేకుండా చేశారని, ఇప్పుడు ఇన్‌ఛార్జుల మార్పుల విషయంలోనూ బడుగులకే తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆక్షేపించారు
125 కులాలకు ఆర్థిక సాయం చేసిన పార్టీ తెలుగుదేశం అని తెలిపిన చంద్రబాబు, వందల కోట్ల విలువ చేసే పరికరాలను గోదాముల్లో ఉంచేసింది వైసీపీ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. గోదాముల్లో పరికరాలను తుప్పుపట్టేలా మార్చారు తప్ప పేదలకు ఇవ్వలేదని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో ఆదరణ ద్వారా వెయ్యి కోట్లు ఇచ్చి ఆదుకున్నామని తెలిపారు. 75 వేల కోట్లు ఖర్చుపెడతామని చెప్పి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు రద్దు చేశారని, బీసీ భవనాలను కట్టినవి కూడా పూర్తి చేయలేదు గానీ 3 రాజధానులు అంటున్నారని ఎద్దేవా చేశారు.