తెలుగుదేశం శ్రేణులపై జరుగుతున్న దాడులను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. చంద్రబాబు నివాసంలో సమావేశమైన తెలుగుదేశం నేతలు... ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. కక్ష సాధింపులో భాగంగానే ప్రజావేదిక కూల్చివేశారని... ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా వాటిని విడిచి పెట్టి ప్రజావేదికపైనే దృష్టి పెట్టడాన్ని నిందించారు. తెలుగుదేశం శ్రేణులపై వైకాపా నేతలు దాడులు చేసి చంపుతుంటే... పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులను అరికట్టాలని డీజీపీని రేపు కలుస్తామని తెలిపారు.
తాజా పరిణామాలపై చర్చ
అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చేలోపు.. నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపాలో చేరడం, మరో ఒకరిద్దరు నేతలు తెదేపా నుంచి బయటకు వెళ్లడం, ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం, తెలుగుదేశం నేతలపై దాడులు, చంద్రబాబు కుటుంబానికి భద్రత కుదింపు వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటన్నింటిపైనా ఈ సమావేశంలో నేతలు చర్చించారు. ప్రజోపయోగమైన ప్రజావేదికను కూల్చివేయడంపై అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. నూతన నిర్మాణంపై దృష్టి పెట్టకుండా కూలగొట్టడంపైనే జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారని ఆక్షేపించారు. అప్పటి పరిస్థితుల్లో ఒక సమావేశం పెట్టడానికి మందిరమూ లేక, ప్రైవేటు భవనాలూ ఖాళీలేక.. అప్పటికప్పుడు యుద్ద ప్రాతిపదికన నిర్మించిన భవనమని నేతలు గుర్తుచేసుకున్నారు. తమ మీద కోపంతోనో, లేఖ రాశాం కాబట్టే ఇవ్వాల్సి వస్తుందనే అక్కసుతోనో కక్ష సాధింపులో భాగంగానే ఇంత హడావుడిగా దానిని కూలగొట్టారని ధ్వజమెత్తారు. జగన్ కుటుంబం నిర్మించిన భవనాలన్నీ నిబంధనలు ఉల్లంఘించి నిర్మించినవేనని నేతలు ఆరోపించారు.