అమరావతిపై మాట్లాడుతున్న చంద్రబాబు ప్రభుత్వ పనుల వల్ల ఒక్క రూపాయి పెట్టుబడి రావడం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. అమరావతితోపాటు మిగతా నగరాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతి అభివృద్ధి కాకుంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని ప్రశ్నించారు. ఖాళీ ఖజానాతో మీరేం ఏం చేస్తారని నిలదీశారు. అనేక హామీలిచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల పెట్టుబడిదారులు అందరూ పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించే సమయం అసన్నమైందని పేర్కొన్నారు. అమరావతిని నిర్వీర్యం చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
మేం కట్టినవి కనిపించడం లేదా..?
ఐదేళ్లలో తాము కట్టినవి కనిపించడం లేదా..? చంద్రబాబు ప్రశ్నించారు. రూ.42 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించామని వివరించారు. రాష్ట్రంలో సంపద సృష్టించేందుకు చాలా కష్టపడ్డానన్న చంద్రబాబు... అమరావతి వల్ల రాష్ట్ర సంపద పెరుగుతుందా.. లేదా.. ప్రజలు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. తాను బతికివున్నంత వరకు పులివెందుల పంచాయతీ జరగనివ్వనని చంద్రబాబు శపథం చేశారు.
అద్భుతమైన ప్రణాళికలు వేశాం...
అమరావతి కోసం అద్భుతమైన ప్రణాళికలు వేశామని చంద్రబాబు వివరించారు. తక్కువవడ్డీతో రుణం ఇచ్చేందుకు పలు బ్యాంకులు ముందుకొచ్చాయన్న ప్రతిపక్ష నేత... రాజధానిలో రూ.2 లక్షల కోట్ల సంపద సృష్టించామని చెప్పారు. రాజధాని పనుల వల్ల స్టీల్, సిమెంట్, ఇతర సామగ్రి వినియోగం పెరిగిందన్నారు. ఈ పనుల వల్ల జీఎస్టీ, ఇతర పన్ను రాబడులు పెరిగాయని వివరించారు.
అమరావతిని చంపే ప్రయత్నం...
మంత్రి బొత్స ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తన ఇల్లు ముంచే క్రమంలో లంకగ్రామాలను ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేసిందని ప్రజావేదికను కూల్చారని ప్రశ్నించారు. హైకోర్టు వద్ద మౌలికవసతులు ఎందుకు కల్పించలేదని నిలదీశారు. పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయని సీనియర్ జర్నలిస్టులే చెబుతున్నారని పేర్కొన్నారు.
సింగపూర్ వెనక్కి వెళ్లింది...
ఈ ప్రభుత్వ పనితీరు కారణంగా సింగపూర్ ప్రాజెక్టూ వెనక్కి వెళ్లిందని చంద్రబాబు ఆరోపించారు. పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, హోటళ్లు అన్నీ వెనక్కి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో ఏముందని మంత్రి కొడాలి నాని అంటున్నారన్న చంద్రబాబు... శ్మశానంలో కూర్చునే ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. శాసనసభ, సచివాలయం, హైకోర్టు, ఇతర భవనాలను శ్మశానం అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
22 మంది ఎంపీలు... ఏం చేశారు..?
తమ ఎంపీ గల్లా జయదేవ్ వల్లే భారత చిత్రపటంలో అమరావతి పేరు పెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని ఎంపిక కోసం మరో కమిటీ వేస్తారా అని...? అని తెదేపా అధినేత ప్రశ్నించారు. రాజధాని అమరావతిని మార్చే ధైర్యం మీకు ఉందా..? అని నిలదీశారు. పారదర్శకత, విశ్వసనీయతలో సింగపూర్‌కు మంచిపేరు ఉందన్న చంద్రబాబు... చరిత్రలో ఎంతో పేరున్న ప్రాంతం.. అమరావతి అని పేర్కొన్నారు. సింగపూర్ లాంటి దేశానికి కూడా అవినీతి అంటగడతారా..? అంటూ ప్రశ్నించారు.
నన్ను తప్పుపడతారా..?
ఒకే సామాజికవర్గానికి అంటూ... తనను తప్పుపడతారా..? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబం, బంధువులు, పార్టీ కోసమో తాను నగరాలు నిర్మించలేదని స్పష్టం చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఎక్కడ జరిగిందని నిలదీశారు. తమ పాలనలో అవినీతి జరిగితే... ఈ 6 నెలలపాటు ఏం చేశారని ప్రశ్నించారు. కుట్రలు పన్ని ఎలాగైనా తనను దెబ్బతీయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
34 వేల ఎకరాలను ఇచ్చారు...
సాగు చేసుకునే భూములు 34 వేల ఎకరాలను రైతులు ఇచ్చారని చంద్రబాబు వివరించారు. ఒక్క వివాదం లేకుండా రైతుల నుంచి భూములు తీసుకున్నామన్న చంద్రబాబు... రాజధాని కోసం దేశవిదేశాల్లో ఉండేవారంతా విరాళాలు ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి కోసం రూ.9,060 కోట్లు ఖర్చు పెట్టాని వివరించారు. రాజధాని అభివృద్ధి చూసి ఇక్కడి భూములకు విలువ పెరిగిందన్నారు.
భావితరాల ఆశలకు ప్రతీక...
అమరావతి ప్రజారాజధాని... భావితరాల ఆశలకు ప్రతీక అని చంద్రబాబు అభివర్ణించారు. ఆనాడు సైబరాబాద్ నిర్మించాం, శంషాబాద్ విమానాశ్రయం తెచ్చామన్న చంద్రబాబు... హైదరాబాద్‌లో ఎంతో ముందుచూపుతో మెట్రో తెచ్చామని వివరించారు. హైదరాబాద్‌లో ఏ కులం చూసి అభివృద్ధి కార్యక్రమాలు చేశానని ప్రశ్నించారు. అక్కడ చేసిన పనులు చూసి ఎంతో సంతృప్తి చెందుతున్నానని పేర్కొన్నారు. ఆనాడు చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్ ఆదాయం పెరిగిందని ఉద్ఘాటించారు.
రాజధాని ప్రాంతాన్ని పునీతం చేశాం...
మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించామని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. పవిత్రమైన మట్టి, నీళ్లతో రాజధాని ప్రాంతాన్ని పునీతం చేశామనిన చంద్రబాబు... వైకాపా నేతలకు మంచిమనసు ఇవ్వాలని దేవుళ్లను కోరుకున్నట్టు వివరించారు. రాజధానిలో కొన్ని భవనాలు 90 శాతం పూర్తయ్యాయని... నిర్మిస్తున్న అన్ని భవనాలను చూశామని చెప్పారు.
అమరావతి పూర్తిగా దెబ్బతింది...
వైకాపా ప్రభుత్వం కుట్రలతో అమరావతి పూర్తిగా దెబ్బతిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆదాయం సమకూర్చే నగరం అమరావతి అని పేర్కొన్నారు. ఇది ఒక్క రాజధానిప్రాంత రైతుల సమస్య కాదన్న ప్రతిపక్ష నేత... తనను నమ్మి రైతులు వేల ఎకరాల భూములు ఇచ్చారని గుర్తుచేశారు. రాజధాని గురించి రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తమపైనే రాళ్లు, చెప్పులతో దాడులు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.