Chain Snatcher Arrested In Nallapadu : జల్సాలకు అలవాటు పడి మహిళల మెడల్లో బంగారు గొలుసులు దొంగతనం చేస్తున్న యువకుడు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను సీఐ బత్తుల శ్రీనివాసరావు తెలిపారు.
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాధాల గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు కొంతకాలంగా తెనాలిలో ఉంటున్నాడు. నరసరావుపేటలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే మద్యం, సిగిరెట్ తదితర వ్యసనాలకు బానిసయ్యాడు. అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడ్డాడు. దొంగిలించిన వాహనాలను అమ్ముతున్న క్రమంలో పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. కొంతకాలం తరువాత జైలు నుంచి బయటకు వచ్చాడు. తరువాత కుటుంబ సభ్యులు అతన్ని తెనాలిలో బంధువుల వద్ద ఉంచారు. అక్కడే ఉండి కూలి పనులకు వెళ్తుడేవాడు.
వ్యసనాలకు బానిసైన అతనికి డబ్బులు అవసరమైనప్పుడు జిల్లాలోని పలు చోట్ల మహిళల మెడల్లో గొలుసులు అపహరించాడు. ఈ ఏడాది జనవరిలో వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడుకు చెందిన చిమిటిగంట ఆరుణ కుమారి ఏటుకూరు రోడ్డులో వెళ్తుండగా వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కొని ఎవ్వరికి దొరకకుండా పరారయ్యాడు. బాధితురాలు నల్లపాడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మార్గంలో ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న యువకులపై నిఘా ఉంచారు. వెంకటేశ్వర్లును అనుమానితుడిగా గుర్తించారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు. గుంటూరు, విజయవాడ, తాడికొండ తదితర ప్రాంతాల్లో బంగారు గొలుసులు, ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడినట్లు వారు గుర్తించారు. ఆటో నగర్ సమీపంలోని వైజంక్షన్ వద్ద వెంకటేశ్వర్లును వలపన్ని అరెస్టు చేశారు.