ఒకప్పుడు పుస్తక పఠనమంటే అందరికీ అమితమైన ప్రీతి. "పుస్తకం హస్తభూషణం" అంటూ ఎవరి చేతిలో చూసినా పుస్తకమే ఉండేది. డిజిటల్ కాలం వచ్చాక... పుస్తకాల పాత్ర పరిమితమైంది. గ్రంథాయాల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితమవుతున్నారు. గ్రంథాలయాలు, పుస్తకాల ముఖం చూడటానికి నేటి తరం.. ఇష్టపడటం లేదు. సమయాభావానికి తోడు పుస్తక పఠనమంటే ఆసక్తి లేకపోవడం, సెల్ ఫోన్లు అందుబాటులోకి రావడమే ప్రధాన కారణం.
ఇలాంటి పరిస్థితిలో పుస్తక పఠనాన్ని మళ్లీ విద్యార్థులకు అలవాటు చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం 'చదవడం మాకిష్టం' కార్యక్రమం చేపట్టింది. గుంటూరులో ఈ కార్యక్రమాన్ని మంత్రులు ఆదిమూలపు సురేశ్, సుచరిత ప్రారంభించారు. ప్రతి పాఠశాలలో గ్రంధాలయాలు, బుక్ రీడింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల పుస్తకాలు గ్రేడింగ్ చేసి పాఠశాలల్లో అందుబాటులో ఉంచుతారు. చిరిగిన పాత అరుదైన పుస్తకాలను చక్కదిద్దుతారు. కథలు, పుస్తకాలకు సంబంధించి విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహిస్తారు.