గుంటూరు జిల్లా నరసరావుపేటలో కేంద్ర వైద్య నిపుణుల బృంద సభ్యులు డాక్టర్ బాబీపాల్, డాక్టర్ నందినీ భట్టాచార్య పర్యటించారు. తొలుత పట్టణంలోని మున్సిపల్ గెస్ట్‌హౌస్‌లో పట్టణ అధికారులతో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. పట్టణంలో వైరస్ ఎలా వ్యాప్తి చెందింది, వాటిని అధికారులు ఎలా గుర్తించారు, పట్టణంలో వైరస్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలను సమీక్షలో స్థానిక ఉన్నతాధికారులు కేంద్ర బృంద సభ్యులకు టెలీస్క్రీన్ ద్వారా వివరించారు.
అనంతరం కేంద్ర బృంద సభ్యులు రెడ్‌జోన్ పరిధిలోని వరవకట్టలో పర్యటించి కరోనా వ్యాధి నివారణపై వైద్యులకు పలు సూచనలు చేశారు. తర్వాత స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన ట్రూనాట్ కిట్లను పరిశీలించారు. కేంద్ర బృందం వెంట నరసరావుపేట ప్రత్యేకాధికారి సబ్ కలెక్టర్ దినేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ చక్రవర్తి, ఆర్డీఓ, డీఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.