రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. ఈ నెలాఖరుతో సీఎస్ పదవీ కాలం పూర్తవుతున్న తరుణంలో.. మరో 6 నెలలు పాటు ఆమెను సీఎస్ గా కొనసాగించాలంటూ సీఎం జగన్.. కేంద్రానికి లేఖ రాశారు. ఈ మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నీలం సాహ్ని.. 2019 నవంబరు 13న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1984 బ్యాచ్‌కు చెందిన ఆమె ఈ నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది.
గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన కార్యదర్శుల పదవీ కాలాన్ని పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆనాటి పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం అప్పటి ఉమ్మడి ఏపీలో సీఎస్ రమాకాంత్ రెడ్డి పదవీకాలాన్ని 3 నెలలు పొడిగించింది. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా పీకే మహంతి పదవీకాలాన్ని 4 నెలల పాటు పొడిగించింది.