ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సినీఫక్కీలో చోరీ... రూ.80 లక్షల సెల్​ఫోన్లు మాయం - mobiles robbery in ap news

గుంటూరు జిల్లాలో కొత్త తరహా దొంగతనం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కంటైనర్​లో రూ.80 లక్షల విలువైన సెల్​ఫోన్లను దుండగులు అపహరించారు. కంటైనర్ రన్నింగ్​లో ఉండగా.. వెంబడించి దోపిడీ చేయడం గమనార్హం. గుంటూరు అర్బన్ ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Cell Phones Robbery In Guntur District while container Running
సినీఫక్కీలో చోరీ... రూ.80 లక్షల సెల్​ఫోన్లు మాయం..!

By

Published : Sep 16, 2020, 4:15 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి-సమీపంలో జాతీయ రహదారిపై సెల్​ఫోన్ కంటైనర్​ను కొల్లగొట్టారు కొందరు దుండగులు. కంటైనర్ డోర్​ పగలగొట్టి 80 లక్షల రూపాయల విలువైన 980 సెల్ ఫోన్లను అపహరించారు. సినీఫక్కీలో జరిగిన ఈ చోరీ వెనుక దుండగులు పక్కా పథకాన్నిరచించారు. శ్రీసిటీ నుంచి కోల్​కతాకు సెల్​ఫోన్ల లోడుతో వెళ్తున్న కంటైనర్​ను గుంటూరు-మంగళగిరి మధ్య దుండగులు వెంబడించి... వెనుక తలుపు పగలగొట్టి లక్షలాది రూపాయల సెల్ ఫోన్లను కాజేశారు. పెదకాకాని వద్దకు రాగానే వెనుక డోర్ తెరిచి ఉండటంతో కొందరు ద్విచక్రవాహనదారులు డ్రైవర్​కు చెప్పారు.

కాజా టోల్ గేట్ వద్ద లారీ ఆపి సరకు చూసుకోగా.. చోరీకి గురైనట్లు డ్రైవర్ గుర్తించారు. వెంటనే మంగళగిరి పోలీసులకు డ్రైవర్ ఫిర్యాదు చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గుంటూరు ప్రాంతంలో ఇది కొత్త తరహా నేరమన్న ఎస్పీ అమ్మిరెడ్డి... మధ్యప్రదేశ్ గ్యాంగ్ పని అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని... త్వరలోనే గ్యాంగ్​ను పట్టుకుంటామని ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... దేవాదాయ శాఖ మంత్రిని, ఇంద్రకీలాద్రి ఈవోను తప్పించండి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details