ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిట్​ ఏర్పాటుపై సుప్రీం​లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

SC ON SIT : ముఖ్య నేతలను కేసుల్లో ఇరికించి కక్ష సాధించేందుకే గత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సిట్‌ వేసిందని.. సుప్రీంకోర్టులో తెలుగుదేశం వాదించింది. దురుద్దేశాలు ఉండటం వల్లే అధికార వైసీపీ నేతలతో సిట్‌ను నింపేశారని తెలిపింది. హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారంటే.. ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకోవచ్చంది. స్టే ఇచ్చాక కేసులు పెట్టడంపై విస్మయం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. విచారణ ముగించి తీర్పును వాయిదా వేసింది.

SUPREME COURT ON SIT
SUPREME COURT ON SIT

By

Published : Nov 17, 2022, 3:41 PM IST

Updated : Nov 17, 2022, 8:17 PM IST

SUPREME COURT ON SIT : గత ప్రభుత్వ విధాన నిర్ణయాల మీద విచారణకు సిట్‌ ఏర్పాటు చేయడంపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. స్టే ఎత్తివేసి విచారణకు అనుమతివ్వాలన్న పిటిషన్‌పై మూడున్నర గంటలపాటు వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ లేవనెత్తిన అంశాలకు.. తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తరఫు న్యాయవాది సిద్దార్థ దవే జవాబిచ్చారు.

ప్రస్తుత పాలకులు ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఒక్క పిటిషన్ కూడా వేయలేదని.. అప్పట్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు వీరికి కనిపించలేదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ పునఃసమీక్షించాలని వైసీపీ సర్కార్ భావిస్తోందని వివరించారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు ఆదేశించిన స్పీకర్‌... ఈ అంశంలో అవసరమైతే సీఎం కొన్ని సూచనలు చేస్తారనడం అభ్యంతరకరంగా ఉందన్నారు. అలాగే ఏ అంశంపై దర్యాప్తు చేస్తారో కనీసం కేసు నమోదు చేసిన వారికైనా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. సిట్ మధ్యంతర నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వ జీవోపై హైకోర్టు స్టే ఎలా విధిస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించగా.. వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను సిద్దార్థ దవే ప్రస్తావించారు.

CRDA వ్యవహారాలపై సీఐడీ కేసును హైకోర్టు కొట్టి వేసిందని తెలిపారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై సీబీఐ విచారణ కోరుతూ 2020 మార్చి 20న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందన లేదంటే.. కేంద్ర సర్కార్ అభిప్రాయమేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. 'ఇన్‌హౌస్‌' విచారణ చేసే అధికారం, అవకాశం ప్రభుత్వానికి ఉంది కదా అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది.

గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ చేయడానికి ఏమీ లేకపోయినా.. ప్రణాళిక ప్రకారమే అంతా చేస్తున్నారని సిద్దార్థ దవే వివరించారు. 15 నెలలు గడిచాక సుప్రీంలో పిటిషన్‌ వేశారంటేనే దురుద్దేశాలు అర్థమవుతున్నాయని అన్నారు. రిటైర్డ్ జడ్జి సారథ్యంలో విచారణ కమిషన్‌ వేస్తే ఇబ్బంది ఉండదని... పూర్తిగా వైసీపీ నేతలు, ఎంపీలతో సిట్‌ వేయడం మాత్రం సరికాదని వాదించారు. నిజానిజాలు తెలుసుకోవడానికి అడ్డుచెప్పబోమని.. కానీ సిట్‌ సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటామంటే మాత్రం అభ్యంతరకరమేనని స్పష్టం చేశారు. ఎందుకంటే... తెలుగుదేశం నేతలందరినీ కేసుల్లో ఇరికిస్తామని సిట్ సభ్యులు బహిరంగ ప్రకటనలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. స్వచ్ఛంగా ఉన్నప్పుడు విచారణకు భయపడటం ఎందుకన్న సుప్రీం ధర్మాసనం.. సిట్ విచారణ తర్వాత కోర్టులో సవాల్ చేయవచ్చు కదా అని ప్రశ్నించింది. అయితే... వాస్తవాలతో సంబంధం లేకుండా అరెస్టులు, క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమిస్తారని, అనేక అంశాల్లో ఇలాంటివి జరిగాయని దవే నివేదించారు. సిట్ విచారణపై హైకోర్టు స్టే ఇచ్చాక కూడా సీఐడీ రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసినట్లు నివేదించగా... సుప్రీం ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. హైకోర్టు స్టే విధించినా ఎఫ్​ఐఆర్​లు నమోదు చేయడమేంటని ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనల తర్వాత తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం.. వాదనలపై నోట్‌ అందించాలని ప్రభుత్వంతోపాటు తెలుగుదేశం తరఫు న్యాయవాదులను ఆదేశించింది.

సిట్​ ఏర్పాటుపై సుప్రీం​లో ముగిసిన వాదనలు

ఇవీ చదవండి:

Last Updated : Nov 17, 2022, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details